నంగునూరు, సెప్టెంబర్ 21: రైతుల సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికకానుంది. పంట రుణమాఫీ, రైతు బంధు, పంటలకు బోనస్ ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ మండల కేం ద్రంలో ఈనెల 27న రైతు ధర్నా నిర్వహించనున్నట్లు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు శనివారం ప్రకటించారు. సన్నాహక ఏర్పాట్లపై రైతులు, బీఆర్ఎస్ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.
అధికారంలోకి రాగానే రూ. 2లక్షల పంటరుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. తూతూమంత్రంగా రుణమాఫీ చేసి మొత్తం చేసినట్లు డబ్బా కొట్టుకుంటుందన్నారు. రైతుల నెత్తిన వడ్డీమోపి మరింత అప్పు ల పాలు చేసిందన్నారు. 31 రకాల కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యలో కోతలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటరుణమాఫీ విషయంలో సీఎం ఒక మాట, మంత్రి ఒక మాట మాట్లాడుతున్నారని, ఈ వ్యాఖ్యలు రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. రైతు భరోసా అని చెప్పి వానకాలం ముగుస్తున్నా దికు లేదన్నారు.
పంట పెట్టుబడి సాయం అందక రైతులు కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని చేతులు దులుపుకుందన్నారు. రైతులపై అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను దుయ్యబట్టేందుకు నంగునూరులో రైతు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, నాయకులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.