సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 23: చిన్నచిన్న సాంకేతిక కారణాలు చూపి మెజార్టీ రైతులకు రుణమాఫీ వర్తింపజేయక పోవడం తగదని, రైతులందరికీ షరతులు లేని రుణమాఫీ చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గొల్లపల్లి జయరాజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
అనంతరం కలెక్టరేట్ ఏవో పరమేశ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు, సీపీఏం జిల్లా కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో సుమారు 2.50 లక్షల మంది రైతులు ఉంటే, ఇప్పటి వరకు మూడు విడతల్లో కేవలం 97,873 మంది రైతులకు మాత్రమే రూ. 846.31 కోట్ల రుణమాఫీ అయిందని వివరించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డు పరిగణలోకి తీసుకోవడంతో అనేక మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదన్నారు.
ఆధార్, బ్యాంక్ ఖాతా, పట్టాపాస్ బుక్‌లో తప్పులు ఉన్న రైతులకు రుణమాఫీ రాకపోవడం రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, సాంకేతిక సమస్యలను కారణంగా చూపుతూ రైతులందరికీ రుణమాఫీ చేయకపోవడం సరికాదన్నారు. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు రుణమాఫీ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఆందోళనలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజయ్య, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, జైపాల్‌రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాగరాజు, రాజిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, భూషణం, మల్లేశం, లక్ష్మణ్ పాల్గొన్నారు.