చిన్నకోడూరు, మే 17: పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని మండుటెండలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో రాజీవ్ రహదారిపై రైతులు ఆదివారం ధర్నా చేశారు. రైతులకు స్థానిక సర్పంచ్ తిరుపతిరెడ్డి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా సర్పంచ్ తిరుపతిరెడ్డి, రైతులు వినయ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి రెడ్డి మహేందర్‌రెడ్డి, గూడ మాధవరెడ్డి మాట్లాడుతూ.. సన్‌ఫ్లవర్ పంట కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లిపూర్ సొసైటీ ఆవరణలో పొద్దు తిరుగుడు పంట పోసి 45 రోజులు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్దఎత్తున ధర్నా, రాస్తారోకో చేపడుతామని హెచ్చరించారు. ధర్నాలో రైతులు మహేందర్‌రెడ్డి, గూడ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.