పటాన్చెరు రూరల్, జూన్ 17: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లక్డారం గ్రామానికి చెందిన రైతు నర్సింహులుకు మూడెకరాల వ్యవసాయభూమి ఉంది. రెండు రోజులుగా ప్రభు త్వం రైతుభరోసా వేస్తున్నదని తెలిసి తన ఫోన్లో వచ్చే ట్రింగ్ అనే సౌండ్, మెసేజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. రెండు రోజులు గడుస్తున్నా ఫోన్లో సర్కారు చెప్పిన ట్రింగ్, ట్రింగ్ మెసేజ్ సౌండ్ మాత్రం అతనికి రాలేదు. ఏమైందని గ్రామపెద్దలను ఆశ్రయించగా, వారు చెప్పిన సమాధానం విని తీవ్ర నిరాశకు లోనయ్యాడు. పటాన్చెరు డివిజన్లోని జిన్నారం, అమీన్ఫూర్, పటాన్చెరు, రామచంద్రాపురం మండలాలకు వానకాలం రైతుభరోసా ప్రభుత్వం వేయలేదు.
ఈ నాలుగు మండలాల్లో 48 గ్రామాల రైతులకు రైతుభరోసా పడలేదు. ఒక్క పటాన్చెరు మండలంలోనే 10161 మంది రైతులు ఉన్నారు. నాలుగు మండలాల్లో వేలల్లోనే తేలారు. రూ. 6 కోట్ల మేర రైతు భరోసా రైతుల అకౌంట్లలో వేయాలి. అది రాకపోవడంతో పటాన్చెరు మండలంలో రైతులకు ప్రోత్సాహం లేకుండా పోయింది. ఒకవైపు వర్షాభావ పరిస్థితి, మరో వైపు కాలుష్యం, ఇతర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా సొమ్మును వేయకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధి ఎఫెక్ట్ …
పటాన్చెరు మండలంలోని పటాన్చెరు, ఆర్సీ పురం మండలాల్లో జీహెచ్ఎంసీకి మూడు డివిజన్లు ఉన్నాయి. త్వరలో అమీన్పూర్ మున్సిపాలిటీ, జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో కలిపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. దీంతో నాలుగు మండలాల్లో జీహెచ్ఎంసీ పట్టణాలు, గ్రామాలు ఉన్నాయని రైతుభరోసాను ప్రభుత్వం నిలిపివేసింది. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్లోని పలు గ్రామాలకు రైతుభరోసా వేయడం లేదు.
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు డివిజన్ను జీహెచ్ఎంసీలోని భాగంగా గుర్తించి రైతు భరోసా వేయలేదని తెలిసింది. పటాన్చెరు, జిన్నారం, అమీన్ఫూర్, రామచంద్రాపురం మండలాల్లోని పలు గ్రామాల్లో నేటికి చక్కగా వ్యవసాయం కొనసాగుతున్నది. వానకాలానికి వ్యవసాయం చేసేందుకు రైతులు పొలాలను దున్ని పెట్టుకున్నారు. రైతు భరోసా ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారిలో అధికశాతం వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది.
పటాన్చెరు డివిజన్లో 27,120 మంది రైతులకు మొండిచెయ్యి..
పటాన్చెరు డివిజన్లోని జిన్నారం, పటాన్చెరు, అమీన్ఫూర్, రామచంద్రాపురం నాలుగు మండలాల్లోని 27,120మంది రైతులకు ప్రభుత్వం రైతు భరోసా అకౌంట్లలో రూపాయి వేయలేదు. రూ. 12.99 కోట్ల రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం నిలిపివేసింది.
జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చాం
పటాన్చెరు డివిజన్ రైతులకు రైతుభరోసా పడలేదని వ్యవసాయశాఖ జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చాం. పూర్తి వివరాలు తెలియజేశాం. వారు కలెక్టర్ దృష్టికి విషయం తెచ్చినట్టుగా తెలిపారు. త్వరలో సమస్య పరిష్కారం కావాలని రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే రైతుల అకౌంట్లలో రైతు భరోసా పడుతుంది. మేమైతే రిపోర్టులు పంపించాం.
-మనోహర, ఏడీఏ పటాన్చెరు