మెదక్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : మూడో విడత రుణమాఫీ జాబితాలో అర్హులైన చాలామంది రైతుల పేర్లు రాక పోవడంతో కర్షక లోకంలో ఆందోళన నెలకొంది. ఈనెల 15న సీఎం రేవంత్‌రెడ్డి మూడో విడత జాబితాను విడుదల చేయ గా, మెదక్ జిల్లాలో రుణమాఫీ సొమ్ము బ్యాంకుల్లో జమ కాలేదని పలువురు రైతులు చెబుతున్నారు. మొదటి, రెండో విడత రుణమాఫీ అమలు సమయం లో తలెత్తిన సమస్యలు, సాంకేతిక కారణలే మూడో విడత రుణమాఫీ సమయంలోనూ రైతులు ఎదుర్కొంటున్నారు.
దీంతో ఏమిచేయలో తెలియక బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రుణమాఫీ డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెబుతుండగా, ఆ డబ్బులు ఇంకా ఖాతాల్లో జమ కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ సరిగ్గా జరిగిందని, మాఫీ డబ్బులు వెంటనే తీసుకున్నామని రైతులు గుర్తుకేస్తున్నారు.
రేషన్‌కార్డు లేదని, కుటుంబసభ్యుల నిర్ధారణ చేయాల్సి ఉందని, పాస్ పుస్తకాలు లేవని, ఆధార్ కార్డులో పేర్లు తప్పుగా ఉన్నాయని, బ్యాంక్ ఖాతాలో ఒక పేరు ఉంటే ఆధార్ కార్డు లో అందుకు సంబంధించిన అక్షరాలు తప్పుగా ఉన్నాయని, తీసుకున్న రుణం తక్కువగా ఉండగా వడ్డీ ఎక్కువగా ఉందని, ప్రభుత్వం ఉద్యోగం ఉందనే కారణాలతో రుణమాఫీ జరగడం లేదని తెలుస్తున్నది.
2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో 98,848 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 98,848 మంది రైతులు రూ.1,018 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. 88,648 మంది రైతులకు సుమారు రూ.800 కోట్ల పైచిలుకు రుణాలు పొందిన వారు ఉంటారని, వారికి ఈ రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.
మొదటి విడతలో 51,492 మంది రైతులకు రూ.257.60 కోట్లు మాఫీ కాగా, రెండో విడతలో 22,850 మంది రైతులకు రూ.216.15 కోట్లు మాఫీ అయ్యింది. ఈ రెండు విడతలు కలిపి 74,342 మందికి రూ.473.76 కోట్లు మాఫీ అయ్యాయి. ఈనెల 15న ప్రకటించిన మూడో విడత మాఫీలో 12,306 మందికి రూ.157.25 కోట్లు మాఫీ అయ్యాయి. మొత్తంగా 84,648 మంది రైతులకు రూ.631.11 కోట్లు మాఫీ అయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
హుస్నాబాద్‌టౌన్, ఆగస్టు 18: మాకు ఐదు ఎకరాల వరకు ఎవుసం ఉన్నది. ఎవుసంకోసం నాపేరు మీద రూ.70 వేలు, మా భార్య ఇందిర పేరు మీద లక్షా 30వేలు అప్పుతీసుకున్నా. నిన్న వచ్చిన జాబితాలో పంటరుణమాఫీ కాలేదు. నాలుగేండ్ల నుంచి ఎప్పటికప్పుడు తీసుకున్న అప్పుకు వడ్డీకూడా కడుతున్నా. కాంగ్రెస్ సర్కారు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తమని చెప్పింది కదా. గింతమంచిగ మిత్తికట్టినంక కూడా మాకు ఎందుకు మాఫీ కాలేదో అర్థంకావడం లేదు.
-కన్నవేని రమేశ్, రైతు, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా
మెదక్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : నేను మెదక్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఏడీబీ) బ్యాంక్‌లో 2022లో రూ. 2 లక్షల క్రాప్ లోన్ తీసుకున్నా. ఒకసారి రెన్యువల్ చేయించిన. మళ్లీ రెన్యువల్ చేయాలని బ్యాంక్ అధికారులు చెప్పలేదు. మూడో విడతలో రుణమాఫీ కాలే. ఈ విషయమై వ్యవసాయాధికారులను సంప్రదిస్తే మెదక్ కలెక్టరేట్ ఆఫీసులో ఫిర్యాదు చేయమన్నారు. అక్కడ ఫిర్యాదు చేశా.
-మల్లయ్య, రైతు, వాడి, హవేళీఘనపూర్ మండలం (మెదక్ జిల్లా)
సంగారెడ్డి, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పంటరుణం మాఫీ అవుతుందని ఎంతో సంబరపడ్డాను. రేవంత్ సర్కార్ రైతులందరికీ రుణమాఫీ చేయకపోవటం బాధిస్తున్నది. మా కుటుంబంలోని నాలుగు మంది రైతులం కంది ఎస్బీఐ బ్యాంకులో పంటరుణం తీసుకున్నాము.మాలో ఒక్కరికి కూడా ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు. నేను ఒక్కడినే 2.7 ఎకరాల భూమిపై లక్ష పంటరుణం తీసుకున్నా. రేషన్‌కార్డు ఉంది అయినా ప్రభుత్వం నాకు పంటరుణమాఫీ చేయలేదు. పేదవాడినైన నాకు ప్రభుత్వం రుణమాఫీ చేయాలి.
-ముత్తంగి శ్రీను, రైతు, జుల్కల్ (సంగారెడ్డి జిల్లా)
నిజాంపేట,ఆగస్టు18: ఏకకాలంలో రూ.2 లక్షల పంటరుణమాఫీ అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన కలగానే మారింది. నిజాంపేటలోని ఏపీజీవీబీలో రూ.90 వేలు పంట రుణం తీసుకు న్నా.మిత్తితో కలిసి రూ.1,11,431 అయ్యాయి. ఐనా పంటరుణం మాఫీ కాలేదు. రైతుల సంక్షేమం కోసం పాటు పడుతున్నామని, రూ.2 లక్షల వరకు పంటరుణమాఫీ చేశామంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నవన్నీ మాయ మాటలే. ఇకనైనా రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలుపుకోవాలి.
-పన్యాల రాజశేఖర్‌రెడ్డి, రైతు, నిజాంపేట, మెదక్ జిల్లా
మిరుదొడ్డి, ఆగస్టు 18 : బ్యాంకులో రూ.60 వేల అప్పు తెచ్చుకున్నా. నేను ఇప్పటికే రూ. 50 వేలు చొప్పున రెండు సార్లు మిత్తి కట్టాను. ఇప్పుడు నాకు బ్యాంకులో రూ. లక్షా 20 వేలు అప్పు ఉన్నది. కానీ పంట రుణమాఫీ రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంట రుణ మాఫీ చేస్తవా..చేయవా చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్లు చేయాలి లేకుంటే పేదోల ఉసురు తగులుతది.
– మైసయ్య, రైతు ఖాజీపూర్, ఉమ్మడి మిరుదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా
మిరుదొడ్డి, ఆగస్టు 18 : నాకు ఎకరంన్నర భూమి పై ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా బ్యాంకు అధికారులు రూ.85 వేల వరకు పంట రుణం ఇచ్చిండ్రు. ఇప్పుడేమో పంట రుణమాఫీ రాలేదు అంటూ చెబుతున్నారు. నా భార్య బీడీల ఫారంపై తోట రాంరెడ్డి అని నా పేరు ఉంది, పట్టా పాసు బుక్కులో తోటరాములు అని ఉన్నది. అప్పు ఇచ్చినప్పుడు లేని తప్పులను ఇప్పుడూ చూపిస్తూ పంట రుణమాఫీ రాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విధంగా పంట రుణమాఫీ చేయాలి.
-తోట రాంరెడ్డి, రైతు, మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా
నర్సాపూర్,ఆగస్టు 18: రెండు లక్షలలోపు పంట రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పింది. 2023లో రూ.1,95,000 రుణానికి సంబంధించి రెన్యువల్ చేసుకున్నా. ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.2,26,000 అయ్యింది. కానీ మూడో విడతలో రెండు లక్షల్లోపు పంటరుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వం నాకు అన్యాయం చేసింది. మూడో జాబితాలో నా పేరు లేదు. ఇదేంటని అధికారులను అడిగితే తర్వాత వస్తదని అంటున్నారు. పంటరుణమాఫీ జరుగుతదని ఎంతో ఆశ పడ్డాకానీ నా ఆశలు అడిఆశలయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పంటరుణమాఫీ చేసి న్యాయం చేయాలి.
– నీరుడి భిక్షపతి, రైతు,అచ్చంపేట్, మెదక్ జిల్లా
శివ్వంపేట, ఆగస్టు 18 : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకలా… గెలిచిన తర్వాత మరోలా రైతులతో ఆడుకుంటున్నది. శివ్వంపేటలోని ఇండియన్ బ్యాంకులో రూ. లక్షా50వేల రుణం తీసుకోగా వడ్డీతో కలిసి ఇప్పుడు రూ. లక్షా58వేలు అయ్యింది. మూడో విడత పంటరుణమాఫీ జాబితాలో నా పేరులేదు. రెండు లక్షల పంటరుణమాఫీ చేస్తామని చెప్పి వరంగల్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీచే అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటింపజేసి ఇప్పుడు మోసం చేశాడు. నాతో పాటు చాలా మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉన్నది.
– వజ్జ రాజు, రైతు సంఘం జిల్లా నాయకుడు, శివ్వంపేట, మెదక్ జిల్ల్లా
శివ్వంపేట, ఆగస్టు 18 : శివ్వంపేటలోని కోఆపరేటివ్ బ్యాంకులో రూ. 60వేల పంటరుణం తీసుకున్నా. రెండో విడత పంట రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. అధికారులను అడిగి దరఖాస్తు పెట్టుకున్నా. మూడో విడత పంట రుణమాఫీ జాబితాలో పేరు వస్తుందని ఆశతో ఎదురుచూసినా రాలేదు. ఏంచేయాలో అర్థంకావడం లేదు. ప్రభుత్వం పట్టించుకొని పంట రుణమాఫీ అయ్యేలా చూడాలి.
-ఎంచర్ల మల్లేశ్,రైతు, తిమ్మాపూర్, శివ్వంపేట మండలం, మెదక్ జిల్లా
కొమురవెల్లి, ఆగస్టు 18 : కొమురవెల్లిలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఆరేండ్ల క్రితం లక్ష రుణం తెచ్చుకున్నా. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకుంటున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2లక్షలు మాఫీ చేస్తామని చెప్పింది. పంటరుణమాఫీ జాబితాలోనూ పేరు రాలేదు. బ్యాంకుకు వెళ్తే అప్పు రూ.2లక్షల 5వేలు ఉంది, రూ. 5వేలు కట్టమన్నారు. దీంతో 5వేలు కడితే రూ.2లక్షలు మాఫీ వస్తదేమో అనుకున్నా. కానీ పేరు పైకి పంపుతామన్నారు. గిదేందో నాకు అర్థం కాలేదు. పంటరుణమాఫీ చేయాలి కానీ గిట్ల ఇబ్బందులు పెట్టుడు బాగాలేదు.
-బచ్చల రమణ, మహిళా రైతు, గురువన్నపేట, సిద్దిపేట జిల్లా
మునిపల్లి, ఆగస్టు 18: కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణమాఫీ మూడు విడతల్లో ఆగస్టు 15లోపు చేస్తామని చెప్పింది…మొదటి విడత నుంచి ఎదురు చూస్తున్నప్పటికీ నా పేరు పంటరుణమాఫీ జాబితాలో లేదు.పంటరుణమాఫీపై మాకు ఎలాంటి ఆశల్లేవ్.బ్యాంకు చుట్టూ తిరిగి నా ప్రయోజనం లేకుండా పోయింది. బ్యాంకు, వ్యవసా యాధికారుల నిర్లక్ష్యం వల్ల నాకు పంటరుణమాఫీ కాలేదు.. నాతో పాటు చాలా మంది రైతులు పంటరుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని పంటరుణమాఫీ చేయాలి.
-అశోక్, బుసారెడ్డిపల్లి, రైతు, మునిపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా