సిద్దిపేట, జూలై 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా పంట రుణమాఫీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నది. రైతు వేదికల్లో సంబురాలు చేసుకుంటున్నది. కానీ, రైతుల్లో అసంతృప్తి అలుముకుంది. పంట రుణమాఫీ అమలులో ఏవేవో నిబంధనలు పెట్టి అర్హుల జాబితాను కుదించడంతో ఎంతో మంది రైతులకు రుణమాఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది. రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తొలుత గత డిసెంబర్ 9నే చేస్తానని నమ్మబలికింది. ఆ తర్వాత తేదీలు మార్చుకుంటూ కాలయాపన చేసింది.
తీరా ఆగస్టు 15 కల్లా మూడు విడతలుగా పంట రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ ప్రకటించారు. పంట రుణమాఫీ పథకానికి ఏవేవో నిబంధనలు రూపొందించి అర్హుల సంఖ్యను కుదించారు. కేంద్రం అమలుచేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిబంధనలను పంట రుణమాఫీకి వర్తింపజేస్తున్నారు. రేషన్‌కార్డు లేని వారికి పంట రుణమాఫీ వర్తిస్తుందా…? లేదా అనేది క్లారిటీ లేదు. దీంతో రేషన్‌కార్డు లేని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట రుణమాఫీ అమలు విషయంలో అటు అధికార యంత్రాంగ గానీ ఇటు బ్యాంకు అధికారులకు ఒక స్పష్టత లేకుండా పోయింది. తమకు పంట రుణమాఫీ అవుతుందా..? అని అధికారులను అడిగితే ఏమో అంటూ వారి నుంచి సమాధానం వస్తున్నది. రెండు రోజులుగా గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో చక్క ర్లు కొడుతున్న లిస్టులో రైతులు తమ పేరు వెతుక్కుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు పంట రుణమాఫీ చేశామని చెబుతున్న లెక్కల ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,53,168 మంది రైతులు ఉన్నారు. వీరిలో సిద్దిపేట జిల్లాలో 53,137 మంది, మెదక్ జిల్లాలో 48,864 మంది, సంగారెడ్డి జిల్లాలో 51,167 మందికి పంట రుణమాఫీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. లక్ష రూపాయల వరకు పంట రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పారు. ఏ గ్రామంలో చూసినా వందల సంఖ్యలో రైతులు ఉంటే గ్రామానికి సరాసరిగా ఇరవై మంది కంటే ఎక్కువ ఆ లిస్టుల్లో పేర్లు లేవు. పంట రుణమాఫీ 12 డిసెంబర్ 2018 నుంచి 09 డిసెంబర్ 2023 మధ్యకాలంలో తీసుకున్న రైతులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది.
ఇదే విషయమై జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చెబుతున్నారు. ఈమధ్య కాలంలో తీసుకున్న పంట రుణాలకు మాత్రమే అనే పదానికి ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ విషయంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. అంతకుముందు తీసుకొని ఏటా రెన్యువల్ చేయించుకున్న వారి సం గతి ఏంటి…? ఇలా ఎన్నో ప్రశ్నలు రైతుల్లో నెలకొన్నాయి. వీటికి స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని చెప్పాలి. పట్టాదారు పాస్ పుస్తకం ఉండి పంట రుణం తీసుకున్న రైతుకు వర్తింప జేయాలి. అప్పుడే రైతులకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.లక్ష వరకు షరతులు లేకుండా పంట రుణమాఫీ చేసింది. ఎంతోమంది రైతులకు లబ్ధి చేకూరింది. చాలామంది రైతులు బ్యాంకుల వద్ద తాకట్టుపెట్టిన పొలాలను విడిపించుకుని రుణ విముక్తులయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లాలో 1,67,771 మంది రైతులకు, మెదక్ జిల్లాలో 1,53,883 మంది, సం గారెడ్డి జిల్లాలో 1,90.002 మంది రైతులకు పంట రుణమాఫీ జరిగింది. ఫలితంగా రైతు లు సంతోషంగా వ్యవసాయం చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు చేయూత లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వానకాలం పంటలు వేసుడు పూర్తి అవుతున్నప్పటికీ ఇంతవరకు రైతుభరోసా ఇవ్వకపోవడంతో అన్నదాతలు అప్పులు చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఠంచన్‌గా రైతుబంధు వచ్చేది. ఇప్పుడు రైతులకు ఆ ధీమా కరువైంది.
కేసీఆర్ ఉన్నప్పుడు నాభార్య జీల రజిత పేరిట పంట రుణమాఫీ అయ్యింది. ఇప్పుడేమో నాభార్యతో పాటు నాకు కూడా రుణమాఫీ కాలేదు. ఆది అడిగేందుకే రైతు వేదికకు వస్తే ఇప్పుడు బిజీగా ఉన్న, ప్రస్తుతం మీటింగ్‌లో కూర్చోండి అంటూ ఏఈవోలు సమాధానం చెప్పుతున్నారు. ఏం చెయాలో అర్థం కావడం లేదు. గతంలో నా భార్య రజిత పేరిట విస్తీర్ణం 1.30 ఎకరాలకు తీసుకున్న రుణం రూ. 60 వేలు మాఫీ అయ్యాయి. నేడు కాంగ్రెస్ సర్కారులో మాఫీ జరగలేదు. నా పేరిట 1.20 ఎకరాల భూమిలోని పంట రుణాలకు రూ. 60 వేల లోన్ తీసుకున్నా. నాకు, నా భార్యకు ఇద్దరికీ కు టుంబంలో వేర్వేరుగా రూ. లక్ష లోపే రుణం ఉంది. కానీ, ఇద్దరిలో ఎవరికీ పంట రుణమాఫీ జరగలేదు. కాంగ్రెస్ సర్కారోళ్లు ఏం చెప్పుతున్నారో, ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది.
– జీల సదయ్య, రైతు, అక్కన్నపేట
నా పేరు మీద రెండు ఎకరాల ఏడు గుంటల భూమి ఉన్నది. గతంలో పంట సీజన్ రాగానే కేసీఆర్ సారు రైతుబంధు పైసలు వేసేవాడు. ఇప్పు డు పంటలు వేసి నెల రోజులు గడిచినా ఇంత వరకు రైతుబంధు రాలేదు. మాకు రైతుబంధు పైసలు ఇవ్వకుండా బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తున్నడు. మేము కూడా బయట అప్పు లు చేసి పంటలను వేసినం. మరి మా పరిస్థితి ఏమిటీ. రైతుబంధు రాకుండానే పంటలు పండిస్తున్న రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి.
– చంద్రయ్య, వెంకటాపూర్, కోహీర్ మండలం
నాకు లక్ష్మీపూర్ గ్రామం లో 38 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఇండియన్ బ్యాంకులో తోటపల్లి బ్రాంచ్‌లో రూ. 56 వేల పంట రుణాన్ని 2019 సంవత్సరంలో తీసుకున్న. అప్పటి నుంచి ఏటా మిత్తి కట్టి తిరిగి రుణం తీసుకుంటున్న. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో పేరు రాలేదు. ప్రభుత్వం నాకు కూడా రుణమాఫీ చేయాలని కోరుతున్న. నాకు తక్కువ భూమి ఉన్న రుణ మాఫీ కాకపోవడం విడ్డూరం.
– బోనగిరి దినేశ్, రైతు, లక్ష్మీపూర్, బెజ్జంకి మండలం
మేము వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొత్తం పొలం పారుతుంది. మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న. 2021లో నారాయణరావుపేట ఆంధ్రా బ్యాంకులో రూ .40 వేలు పంట లోన్ తెచ్చుకున్నాం. మిత్తి కట్టుకుంటా రెన్యువల్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ లిస్టులో మా పేరు లేదు. దయచేసి మా లోన్ ప్రభుత్వం మాఫీ చేయాలి. మా ఊర్లో కొందరికి అయింది. మాకు మాత్రం కాలేదు.
– ఒగ్గు లక్ష్మీరాజయ్య, లక్ష్మీదేవిపల్లి, సిద్దిపేట
నాకు 37 గుంటల భూమి ఉంది. దానిపైన 2021లో సిద్దిపేట బ్యాంక్ ఆఫ్ బరోడాలో 60 వేల రూపాయల క్రాప్ లోన్ తీసుకున్న. ప్రతి సంవత్సరం వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకుంటున్నా.ప్రభుత్వం చెప్పినట్టు రుణమాఫీ అవుతుందని అనుకున్న. కానీ, నిన్న ప్రభుత్వం విడుదల చేసిన లిస్ట్‌లో నా పేరు లేదు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ప్రభుత్వం మాలాంటి వారి రుణాలను సైతం మాఫీ చేయాలి. ఈ విషయంపై అధికారులను అడిగితే వచ్చే లిస్టులో వస్తది అంటున్నారు. వస్తదో రాదో తెలియక ఇబ్బంది పడుతున్నాం.
– అశోక్, రైతు, సిద్దిపేట
2017 నవంబర్ 9న నేను నా పేరున రూ.లక్షా 2 వేలు, నా సతీమణి జోగ్గారి సునంద పేరున రూ.50 వేల పంటరుణం తీసుకున్నం. 4 ఎకరాల భూమిపై ఇద్దరం కలిసి రూ.లక్షా 52 వేలు వరకు రుణం తీసుకున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ లిస్టులో రూ.50 వేల పంట రుణం తీసుకున్న నా సతీమణి జోగ్గారి సునంద పేరు రాలేదు. రుణమాఫీ అవుతదని ఎంతగానో ఎదురుచూశాం. సీఎం రేవంత్‌రెడ్డి మాలాంటి రైతులను మోసం చేసిండు.
– జోగ్గారి బాల్‌నర్సయ్య, రైతు, లింగుపల్లి, మిరుదొడ్డి మండలం
పంట రుణమాఫీతో పాటు రైతుభరోసా వేస్తే మంచిగుండు. నాకు 4 ఎకరాల భూమిపై రూ.1.10 లక్షలు, నా కుమారుడు గుండిగారి రాజు రూ.50 వేలు పంట రుణాలను తీసుకున్నాము. నా కుమారుడికి రూ.50 వేలు రుణమాఫీ వచ్చింది. రెండో జాబితాలో నా పేరు వస్తుందేమో అనకుంటున్నా. అందరి పంట రుణాలు మాఫీ చేయాలి.
– గుండిగారి రాజయ్య, రైతు, లింగుపల్లి, మిరుదొడ్డి మండలం
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన రైతులకు కూడా సగం మాత్రమే రుణమాఫీ చేసింది. రూ.లక్ష రుణ మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ, అందులో కొందరికి మాత్రమే రుణమాఫీ చేసింది. నేను ఏపీజీవీబీలో రూ.లక్ష రుణం తీసుకున్నా. రెన్యువల్ చేయిస్తున్నా. అయినా నాకు రుణమాఫీ కాలేదు. లిస్టులో నా పేరు రాలేదు. వెలిమెల గ్రామంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం నాట్లు వేశాం. రుణమాఫీని కొందరికి చేసి కొందరికి చేయకుండా ఉండడం సరికాదు. అర్హులైన రైతులకు నామమాత్రంగా రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకోవడం కాంగ్రెస్ సర్కారుకు తగదు.
– కమ్మెట్ట ప్రభాకర్‌రెడ్డి, వెలిమెల, ఆర్సీపురం