జహీరాబాద్, ఆగస్టు 19: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తారని అన్నదాతలు కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారీగా ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ సరఫరా చేయ డం లేదు. వ్యవసాయానికి 12 గంటలు సరఫరా చేస్తామని రికార్డులో నమోదు చేసినా అక్కడ 6 గంటలు కూడా సరఫరా చేయడం లేదు. వ్యవసాయానికి ఉదయం 3 గంటలు సరఫరా చేస్తున్నారని రైతులు తెలిపారు. కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్) వ్యవసాయానికి పగలు 6 గంటలు సరఫరా చేస్తున్నామని ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
విద్యుత్తు సబ్స్టేషన్లు మరమ్మతులు, లైన్ల మరమ్మతుల పేరుతో ప్రతిరోజూ కరెంట్ బంద్ చేస్తున్నారని అన్నదాతలు తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గానికి సమీపంలో కర్ణాటకలోని బీదర్, కలబుర్గా జిల్లాలు ఉన్నాయి. బీదర్, హుమ్నాబాద్, చించొలి తాలూకా కేంద్రాలు మొగుడంపల్లి, జహీరాబాద్, న్యాల్కల్ మండలాలకు సరిహద్దులో ఉన్నాయి. తెలంగాణలో వ్యవసాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ సరఫరా చేస్తుంది. తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని ఆనందంగా చేసుకుంటున్నారని, కరెంట్ సమస్య లేదని కర్ణాటక రైతులు తెలుపుతున్నారు. కొన్ని వారాలు రాత్రికి కరెంట్ సరఫరా చేయడంతో పంటలకు నీరు అందించేందుకు రాత్రి సమయంలో వ్యవసాయ బావుల వద్ద పడుకొనే పరిస్థితి ఉందన్నారు.
కోతలు విధించేందుకు పవర్ లైన్స్ మరమ్మతులు, మెయింటెనెన్స్ పనులు చేస్తున్నామని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనధికార కోతలు అధికంగా విధిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ కోతలు విధించడంతోపాటు చార్జీలు పెంపుతో రైతులు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాసన సభ ఎన్నికల్లో గృహజ్యోతి పేరిట ఉచిత కరెంట్ సరఫరా చేస్తామని ప్రకటించి ఇప్పుడు కరెంట్ కోతలు విధిస్తున్నారని మండిపడుతున్నారు. బీదర్, కలబుర్గా జిల్లాల్లో రైతులు వ్యవసాయ బావుల వద్ద చెరకు, కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలు అధికంగా సాగు చేస్తున్నారు. వ్యవసాయానికి సక్రమంగా కరెంట్ సరఫరా లేక వేసిన పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.