సిద్దిపేట, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నదాతలు గత యాసంగి బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. 2024-25 యాసంగిలో రైతులు తమ సన్నరకం వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే ప్రభుత్వానికి విక్రయించారు. ప్రతి క్వింటాల్‌కు అదనంగా రూ. 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికి ఆశపడ్డ రైతులు సన్నరకం వడ్లు తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే నాలుగు నెలులు దాటుతున్నా ఇంతవరకు ఆ డబ్బులు రైతులకు రాలేదు. ఉమ్మడి జిల్లాలో 19,321 మంది రైతులకు కలిపి మొత్తం రూ. 41.93 కోట్ల బకాయిలు ఉన్నాయి. బోనస్ బకాయిలపై ప్రభుత్వం ఆఊసే ఎత్తడం లేదని రైతులు మండి పడుతున్నారు. నిత్యం బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. ఈ విషయమై ఏ అధికారిని అడిగినా స్పష్టత ఇవ్వడం లేదు.తాజాగా వానకాలం ధాన్యం కొనుగోలు ప్రారంభించారు.
యాసంగి బోనస్ డబ్బులు ఇంత వరకు రైతుల ఖాతాలో పడలేదు. ఇప్పటి వరకు ఆ డబ్బులు ప్రభుత్వం చెల్తిస్తుందా లేదా తెలియని పరిస్థితి. తాజాగా వానకాలం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. 48 గంటల్లోనే చెల్లిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి చేతులు దులుపుకుంది. యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన బోనస్ డబ్బుల గురించి ఊసేలేదు. దీంతో రైతులు అసలు తమ బోనస్ డబ్బులు వస్తాయా..? రావా..? అని అధికారులను అడుగుతున్నారు. ప్రభు త్వం నుంచి వస్తేనే మీకు బోనస్ డబ్బులు వస్తాయికానీ తామేమి చేయలేమని అధికారులు సమాధానం చెబుతున్నారు.
సన్న వడ్లకు ఒక క్వింటాల్‌కు రూ 2,889 పెట్టి కొనుగోలు చేసింది. దొడ్డు వడ్లకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2389 కాగా బోనస్ రూ. 500 మొత్తం సన్నాలకు ఒక క్వింటాల్‌కు రూ. 2,889 కొనుగోలు చేసింది. సిద్దిపేట జిల్లాలో సన్నాలకు సంబంధించిన 3,162 మంది రైతులకు సంబంధించి 13,682 క్వింటాళ్ల సన్నాల బోసన్ రూ.6 కోట్ల 84 లక్షలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మెదక్ జిల్లాకు సంబంధించి 14,994 మంది రైతుల నుంచి 62,747 క్వింటాళ్ల సన్నాలకు సంబంధించి రూ. 31.37 కోట్ల బకాయిలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1165 మంది రైతులకు సంబంధించి రూ. 3.72 కోట్లు కాగా 7,600 క్వింటాళ్ల సన్నాల ధాన్యం ప్రభుత్వానికి విక్రయించారు.
సాగు పరంగా దొడ్డు వడ్ల కంటే సన్న వడ్ల సాగుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఒక ఎకరానికి దొడ్డు వడ్ల సాగు పెట్టుబడి రూ. 20 వేలు అయితే సన్నాల సాగుకు రూ. 25 వేల వరకు ఖర్చు అవుతుంది. సన్నాల సాగు శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది. దాంతో రైతులు ఎక్కువగా దొడ్డు రకం వడ్ల సాగుకే మొగ్గు చూపుతారు. ప్రభుత్వం బోనస్ డబ్బులు ఇస్తామని ఆశ పెట్టడంతో రైతులు కొంత సన్నాల సాగుకు మొగ్గు చూపారు. తీరా సాగు చేసిన తర్వాత సన్నాలకు ఇచ్చే బోనస్‌ను ప్రభుత్వం ఎగ్గొడుతుంది. గత యాసంగిలో సన్నరకం వడ్లు అమ్ముకున్న రైతులకు నాలుగు నెలలు దాటినా డబ్బులు ఇంత వరకు పడలేదు. దీంతో రైతులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. వానకాలంలో సన్నాలు సాగు చేసిన రైతులు డైలామాలో పడ్డారు. ప్రభుత్వానికి అమ్మితే బోనస్ వస్తదా..రాదా? అనే
సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గత యాసంగి డబ్బులే ఇంత వరకు ఇవ్వలేదు. పైగా వాటి గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రూపాయి తక్కువైనా ఫర్వాలేదు కానీ డబ్బులు వెంటనే కావాలి అని ప్రైవేట్ వ్యాపారులు, ఇతరులకు సన్నాలు అమ్ముకుంటున్నారు. కొంత మంది రైతులు రైస్ మిల్లులకు తరలించి బియ్యం పట్టించి అమ్మడానికి సిద్ధమవుతున్నారు. గత యాసంగి బోనస్ డబ్బులు ఆలస్యం కావడంతో బయట పెట్టుబడికి తీసుకువచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక పోతున్నామని రైతులు వాపోతున్నారు. ధాన్యం అమ్మగానే 48 గంటల్లోనే జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం తాజాగా ఆఊసే ఎత్తడం లేదని రైతులు మండి పడుతున్నారు. మళ్లీ ఇప్పుడు 48 గంటల్లోనే చెల్లిస్తామని మాయమాటలు చెబుతుంది అని ప్రభుత్వం తీరును రైతులు ఎండగడుతున్నారు.
సన్నవడ్లకు బోనస్ రూ. 500 ఇస్తామంటే నమ్మి పెట్టినందుకు సర్కారు రూపాయి కూడా ఇవ్వలేదు. బోనస్ అంతా ఉత్తముచ్చటే. స్వయంగా రేవంత్‌రెడ్డి చెప్పిన మాటకే అతీగతీ లేదు. పంట రుణమాఫీ, రైతుబంధు ఎగ్గొట్టుడు ఇలా చెప్పుకుంటే రైతులకు సర్కారు చాలా బాకీ పడింది. సన్నవడ్లు సాగు చేస్తే దిగుబడి తగ్గినా బోనస్ కలిసి వస్తదనే ఆశతో పెడితే ఇటు దిగుబడి రాక, అటు బోనస్ రాక రెండింటికి చెడిపోయినట్లు అయ్యింది. 40 క్వింటాళ్ల బోనస్ పైసలు రావాలె. ఇంకో ఐదారు నెలలు అయితే ఏడాది అయితది. కాంగ్రెస్ సర్కారు మాట నమ్మేది లేదు.
– భూక్యా లక్ష్మణ్, గిరిజన రైతు, చెరువుముందు తండా (అక్కన్నపేట), సిద్దిపేట జిల్లా
కాంగ్రెస్ సర్కారు రైతులను నిండా ముంచింది. రైతుల బతుకులతో ఆటలాడుకుంటుంది. సన్నవడ్లకు రూ. 500 బోనస్ అంటే ఆశపడి సాగుచేసి విక్రయిస్తే నోట్లో మట్టి కొట్టింది. గత యాసంగి సన్నధాన్యం 50 క్వింటాళ్ల బోనస్ డబ్బులు రావాలి. ఇప్పటి వరకు రూపాయి రాలేదు. ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. బోనస్ పైసలు వస్తాయన్న నమ్మకం లేదు. రైతులను సర్కారు దగా చేసింది. ఒడ్డు ఎక్కేదాక ఓ మాట…ఒడ్డుఎక్కినంక ఓ మాట అన్నట్లు ఉంది కాంగ్రెస్ సర్కారు పని తీరు. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకు అధ్వానంగా మారింది.
– వల్లపు సదయ్య, రైతు, అక్కన్నపేట, సిద్దిపేట జిల్లా
నిజాంపేట, అక్టోబర్ 27: సన్నవడ్లు పండిస్తే క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మాయమాటలు నమ్మి యాసంగిలో సన్నవరి సాగు చేశా. కొనుగోలు కేంద్రంలోనే 45 క్వింటాళ్ల సన్నవడ్లు విక్రయించా. వానకాలం వడ్లు మళ్లీ కాంటా పెట్టే సమయం వచ్చినా యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు. బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మోసం చేస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డ సన్నవడ్ల బోనస్ పైసలు జమచేయాలి.
మిరుదొడ్డి,అక్టోబర్ 27: యాసంగిలో సన్నవడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ డబ్బులు ఇవ్వలేదు. మిరుదొడ్డి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో సన్నరకం వడ్లు విక్రయించా. ఇప్పటీకీ ప్రభుత్వం సన్నవడ్ల బోనస్ డబ్బులు వేయలేదు. సీఎం రేవంత్‌రెడ్డి సన్న వడ్లకు బోనస్ డబ్బలు ఇస్తానని రైతులను మోసం చేస్తున్నాడు. రైతులను మోసం చేయడం తగదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
– దార మల్లయ్య, రైతు మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా