సిద్దిపేట,సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రూ.రెండు లక్షల రుణమాఫీ మాకెందుకు కాలేదని ఉమ్మడి జిల్లాలోని రైతులు ఎదురుచూస్తున్నారు. మూడు విడతల్లో మాఫీ అవుతుంది అనుకున్నాం. కానీ, ఏ విడతలోనూ మాఫీ కాలేదు. బతుకమ్మ, దసరా పండుగలు వస్తున్నాయి. పండుగకు పస్తులేనా..? ఇక మాకు రుణమాఫీ అవుతుందా..? కాదా..? అనే అయోమయంలో రైతులు ఉన్నా రు. రూ. రెండు లక్షలపైన ఉన్న వారి విషయంలో ప్రభు త్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఒక వైపు ప్రభుత్వం కటాఫ్ పెట్టిన తేదీకి 9 నెలలు దాటుతున్నది.
సకాలంలో రుణాలు రెన్యువల్ చేయకపోతే బ్యాంకులు డిఫాల్ట్ కింద జమ చేస్తాయి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు ఉన్నారు. రుణమాఫీ చేయాలని రైతులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులతో కలిసి ధర్నా చేపడుతున్నారు. కార్యక్రమానికి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హాజరుకానున్నారు. మండలంలోని ఆయా గ్రామా ల్లో రుణమాఫీ కాని రైతుల వివరాలను బీఆర్ఎస్ కార్యకర్తలు సేకరించారు. వాటినన్నింటినీ ఒక నివేదిక రూపంలో తయారు చేశారు. రైతుల పూర్తి వివరాలను అందులో పొందుపర్చారు.
రైతులు ఆయా బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు ఏడాదిలోగా రెన్యువల్ చేసుకోవాలి. కానీ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయకపోవడంతో రుణాలు రెన్యువల్ చేయడంలో రైతులు ఆయోమయంలో ఉన్నారు. దీంతో రైతులకు అటు రుణమాఫీ కాక, అటు రుణాలు రెన్యువల్ కాక అవస్థలు పడుతున్నారు. కొంతమంది రైతులు బయట వడ్డీలకు తీసుకొచ్చి రుణాలు రెన్యువల్ చేయించుకుంటున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోతే అసలు, వడ్డీ కలిపి తడిసిమోపెడవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు పంట రుణమాఫీకి అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదు. ఇటీవల గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంటి పేర్లలో దొర్లిన తప్పుల వివరాలను సేకరిస్తున్నారు. మరి ఒకే కుటుంబంలో రెండు లక్షలపైన ఉన్న రైతులు వివరాలను ఎందుకు సేకరించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. రెండు లక్షలకు పైన ఉన్న కుటుంబ సభ్యులది వ్యవసాయ శాఖ పోల్డర్లో కుటుంబ నిర్ధారణ కావల్సి ఉంది అని వస్తుంది.
మరి ఈ రైతుల పరిస్థితి ఏంటి ..? దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. రైతులకు సకాలంలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు పనులు విడిచి రోజూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెకొంది. ఒకవైపు రైతులకు మాఫీ చేసిన పంట రుణాలు ఇవ్వడంలోనూ బ్యాంకు అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. మరోవైపు కొత్త రుణాలను ఇవ్వడం లేదు. కొత్తగా రుణాలు పొందాలంటే రైతులు తీసుకునే బ్యాంకు పరిధిలోని అన్ని బ్యాంకుల నుంచి నోడ్యూ సర్టిఫికెట్ తీసుకురావల్సి ఉంటుంది. రైతులు బ్యాంకుల వదగ్దకు వెళితే అధికారులు రేపుమాపు అంటూ తిప్పుతున్నారు.
నాకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.1.50 లక్షల క్రాప్ లోన్ ఉంది. గతేడాది లోన్ రెన్యువల్ చేసిన. కానీ, రుణమాఫీ లిస్ట్‌లో నాపేరు రాలేదు. ఇదే విషయంపై ఏఈవోను ఆడిగితే ఎందుకు రాలేదంటే నాకు, మానాన్నకు ఒకటే రేషన్ కార్డు ఉండడంతో రాలేదన్నారు. మానాన్నకు ఎస్బీఐ ఏడీబీలో పంట లోన్ ఉండటం వల్ల పేరు లిస్ట్‌లో రాలేదన్నారు. రూ.2 లక్షలకు పైన ఉన్న మొత్తం కట్టమంటే కడతానంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. కట్టవద్దన్నారు. బ్యాంకర్లకు ఆడిగితే మాకు ఏం తెలియదంటున్నారు.
-శ్రీనివాస్, రైతు, సిద్దిపేట
సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వం మూడు విడతలుగా రుణమాఫీ చేసింది. మూడు విడతలు కలిపి 1,02, 323 మంది రైతుల ఖాతాల్లో రూ.843.05 కోట్లు జమ చేసింది. ఇంకా లక్ష మంది రైతులు ఉంటారని అంచనా. మెదక్ జిల్లాలో మూడు విడతలుగా 87, 46 2 మంది రైతులకు రూ.640.87 కోట్లు మాఫీ జరిగింది. ఇంకా 40 శాతం మందికి రుణమాఫీ కావాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లాలో మూడు దశల్లో కలిపి 98,251 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.849. 45 కోట్లు జమ చేసింది. ఈ జిల్లాలో సైతం 50శాతం వరకు రుణమాఫీ కాలేదు.
నాకు నాలుగెకరాల భూమి ఉన్నది. ఎవసం కోసం 2018 నవంబర్‌లో లక్షాయాభై వేల రూపాయలు అప్పు తీసుకున్న. ఏటా వడ్డీ కడుతున్న. అయినా నాకు మాఫీ గాలేదు. ఎందుకు గాలేదు అని కెనరా బ్యాంక్ మేనేజర్‌ను అడిగితే మేం లిస్టు పంపినం. మాదగ్గర ఏమిలేదని అన్నరు. మల్ల అగ్రికల్చర్ అఫీసుకుపోయి మాఫీ ఎందు కు చెయ్యలేదని అడిగితే బ్యాంకునుంచి స్టేట్మెంట్ తీసుకురమ్మని సెప్పిండ్రు. ఇప్పటికి రెండుమార్లు బ్యాంకుకు, అగ్రికల్చర్ అఫీసుల చుట్టూ తిరుగుడైంది.
-రావుల చంద్రారెడ్డి, రైతు, పొట్లపల్లి
నాకు మూడెకరాల పొలం ఉంది. దానిపై ఎస్బీఐ ఏడీబీ బ్యాంక్‌లో రూ.90వేలు పంటలోన్ తీసుకున్న. ఇప్పుడు రూ. 2.05 లక్షలు అయ్యింది. నాకు రుణమాఫీ కాలేదు. రూ.రెండు లక్షల కంటే ఎక్కువ లోన్ ఉందని రుణమాఫీ కాలేదట. మీది పైసలు కడుతానని చెప్పినా బ్యాంక్‌లో సార్లు మాకు ఎం తెలువదంటున్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి.
-బత్తుల నారాయణ,రైతు, గోపులాపూర్, నారాయణరావు పేట మండలం