కోహీర్, సెప్టెంబర్ 18: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంత రైతులు విభిన్న రకాల పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెరుకు, ఆలుగడ్డ, పసుపు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, కూరగాయల పంటలు పండిస్తున్నారు. స్థానికంగా ఆలుగడ్డ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, పంజాబ్‌లోని జలంధర్, గుజరాత్, తదితర దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నది. దీంతో దూరభారంతో పాటు ఆర్థికంగా భారమవుతున్నది. స్థానికంగా కోల్డ్ స్టోరేజ్ ఉంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
కానీ, ఈ ప్రాంతంలో కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు చేసి విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. దీంతో వ్యాపారుల నుంచి అధిక ధరలకు రైతులు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. 50కిలోల విత్తన బస్తాను రూ.1200వరకు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. దీంతో అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఆలుగడ్డ పంట సాగుపై అన్నదాతలు ఆసక్తి చూపిస్తున్నారు. బోరుబావుల్లో పుష్కలంగా నీళ్లుండడంతో ఆలుగడ్డ సాగుపై రైతన్నలు ప్రాధాన్యత ఇస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా కోహీర్ మండలంలో 3వేల ఎకరాలకు పైగా ఆలు సాగవుతున్నది. ఈసారి సాగు విస్తీర్ణం నాలుగు వేల ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉంది.
ఆలుగడ్డ విత్తనం నాటిన తర్వాత 70 రోజుల నుంచి 90రోజుల్లో పంట చేతికి వస్తుంది. తొందరగా లాభాలను పొందాలనే ఉద్దేశంతో రైతులు ఆలు సాగుపై మక్కువ ప్రదర్శిస్తున్నారు. మరీ ఇంత తక్కువ కాల పరిమితిలో ఇతర పంటలు ఏవీ చేతికి రావు. బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉన్న రైతులు సాగుపై శ్రద్ధ కనబరుస్తున్నారు. ఖాళీ భూమి ఉన్న రైతులతో పాటు సోయాబీన్, మొక్కజొన్న, కంది పంట ధాన్యం తీసుకొని అందులో కూడా ఆలుగడ్డ విత్తనం నాటే అవకాశం ఉంది.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలో ఆలు సాగుకు విత్తనాలను నాటడం ప్రారంభిస్తారు. కానీ, వర్షాలు అధికంగా కురుస్తుండడంతో భూమి సరిగా తయారు కాలేదు. కోహీర్, కవేలి, గొటిగార్‌పల్లి, దిగ్వాల్, పీచెర్యాగడి, మాచిరెడ్డిపల్లి, సజ్జాపూర్, బిలాల్పూర్, మనియార్‌పల్లి, తదితర గ్రామాల్లో అత్యధికంగా ఆలుగడ్డ పంట ఎక్కువగా పండిస్తుంటారు. ఆలుగడ్డ విత్తనాలు మాత్రం స్థానికంగా లభించవు. దీంతో విత్తనాల కోసం చాలామంది .
రైతులు 2 వేల కిలోమీటర్ల దూరంలోని ఆగ్రా, పంజాబ్‌లోని జలంధర్, గుజరాత్, తదితర దూర ప్రాంతాల నుంచి లారీల్లో విత్తనాలను తెస్తున్నారు. కొంతమంది రైతులు వారం పాటు
అక్కడే ఉంటూ సరైన విత్తనాల సేకరణ కోసం వేచి చూస్తున్నారు. దీంతో సమయం వృథా కావడంతో పాటు అన్నదాతలపై ఆర్థిక భారం పడుతున్నది. ఆలుగడ్డ విత్తనాల కోసం వారు పడుతున్న ఇబ్బందులను తీర్చాలని రైతులు కోరుతున్నారు.
మా గ్రామంలో చాలామంది రైతులు ఆలుగడ్డను ప్రతి సంవత్సరం పండిస్తున్నారు. నేను ప్రతి సారి 50క్వింటాళ్ల కంటే ఎక్కువగానే విత్తనాలను కొంటాను. గతంలో విత్తనాల కోసం రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రా, జలంధర్ వెళ్లాను. అక్కడ రైతులకు అన్నీ కష్టాలే. పైసలతో పాటు టైం వేస్ట్ అవుతున్నది. రైతుల మంచి జరగాలంటే ఇక్కడ కోల్డ్‌స్టోరేజీని ఏర్పాటు చేయాలి. – నర్సింహులు,
రైతు, కొత్తూర్(డి) కోహీర్ మండలం (సంగారెడ్డి జిల్లా)
కోహీర్ మండలం నుంచి చాలా మంది రైతులు ఏటా ఆగ్రా, జలంధర్, తదితర దూర ప్రాంతాలకు వెళ్లి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడే కోల్డ్‌స్టోరేజీ ఉంటే అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు. రైతుల అవసరార్ధం కోల్డ్‌స్టోరేజీ నిర్మాణానికి ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు పంపినం. మంజూరైతే ఆలుగడ్డ రైతుల ఇబ్బందులు తీరుతాయి.
– నవీన్‌కుమార్, మండల వ్యవసాయాధికారి, కోహీర్ (సంగారెడ్డి జిల్లా)