నంగునూరు, నవంబర్ 2: కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు నిరసన తెలిపిన ఘటన మండలలోని రాంపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. మండలంలో నంగునూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 5, పాలమాకుల పీఏసీఎస్ ఆధ్వర్యంలో 13, ఐకేపీ ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించారు.
కానీ, ఇప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదని రైతులు మండిపడ్డారు. అధికారులతో మాట్లాడి వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని రాంపూర్ బీఆర్ఎస్ నాయకుడు పరశురాములు కోరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని, ఇప్పటికే సగానికి పైగా ధాన్యం దళారులకు అమ్ముకున్నామని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.