మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి 12: యాసంగిలో సాగుచేస్తున్న వరి పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బోరుబావుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఎండిన పంటపొలాలను పశువుల మేతకు వదిలి పెట్టి, పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతన్నలు దీనంగా చూస్తున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లికి చెందిన రైతు మంతెన మహిపాల్‌రెడ్డికి నాలగున్నర ఎకరాల భూమిలో మూడెకరాల భూమిలో వరి పంట, మిగతా ఎకరం 20గంటల భూమిలో నువ్వులు, మినుములు, పెసర పంటలతో పాటు కూరగాయ పంటలను వేశాడు.
ఈ పంటలకు నీటిని అందించేందుకు మూడు బోరుబావులు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు పైపుల నిండా పోసిన బోరుమోటర్లు నీళ్లు లేక నల్లా నీళ్ల మాదిరిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పోస్తుండడంతో సుమారు ఎకరం వరి పంట అర ఎకరంలోని వివిధ పంటలు ఎండిపోతున్నాయి. వేసవికి ముందే పంటలు ఎండిపోతుండడంతో మరో రెండు నెలల పాటు పంట పొలాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక రైతు మహిపాల్‌రెడ్డి ఆందోళన చెందుతున్నాడు. దీనికి తోడు సాయంత్రం వేళ 5గంటల నుంచి రాత్రి 10గంటల వరకు కరెంట్ కట్ చేస్తున్నారని, 10గంటల తర్వాత కరెంట్ వస్తుండడంతో కొన్నిమార్లు ఫ్యూజ్‌వైర్లు పోయి బోరుమోటర్లు నడవని పరిస్థితి ఏర్పడుతుండడంతో రాత్రిళ్లు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాళ్సిన పరిస్థితి నెలకొందని రైతు వాపోయాడు. మూడెకరాల వరి సాగుకు రూ. 50వేల వరకు ఖర్చుచేశానని, పంటలు ఎండిపోతుండడంతో పెట్టుబడి మీదపడి అప్పులపాలు అయ్యేలా ఉందని రైతు మహిపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.
మూడు బోరుబావుల్ల నీళ్లు లేవు
ఎండకాలం రాకముందే బోరుబావుల్ల నీళ్లు పాతాళానికి పోయినయి. బోరుబావుల్ల నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయి. నిన్నమొన్నటి వరకు చెరువు, కుంటల్ల నీళ్లు ఉండడంతో బోరుబావుల్ల నీళ్లు ఉండేవి. ఇప్పుడు చెరువు, కుంటలు కూడా ఎండిపోతున్నయి. ఎండిన చెరువు, కుంటల్ల నీళ్లు నింపితే బోరుబావుల్ల నీళ్లు ఉండేది. నేను 2006 నుంచి ఎవుసం చేస్తున్న నాకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. మూడు బోరుమోటర్లు ఇప్పుడు నల్ల పోసినట్లు గ్యాప్ ఇచ్చుకుంట పోస్తున్నయి. ఇప్పటికైతే ఎకరం వరి పంట పూర్తిగా ఎండిపోయింది. రేపు అయింతా పంట కూడా ఎండిపోతదన్న డౌట్ వస్తుంది. అసలే బోర్లల్ల నీళ్లు లేక ఆగమైతుంటే కరెంటోళ్లేమో సాయంత్రం 5గంటలకే కరెంట్ తీసేస్తున్నరు. మల్ల రాత్రి 10గంటలకు కరెంట్ వస్తంది.
అప్పడు స్టార్లర్ల ప్యూజ్ వైర్లు కూడా పోతున్నయి. దీనికోసం రాత్రి పూడ ఎన్కట లెక్కనే బావులకాడికి పోయి పండుకోవాల్సి వస్తంది. ఎండిన వరిపొలంలో చేసేది ఏమిలేక బర్లను మేపుతున్న. మూడెకరాల వరి పొలానికి రూ. 50వేల పెట్టుబడి అయ్యింది. ప్రభుత్వం రైతుబంధు కూడా ఇయ్యకపాయే పెట్టుబడి కోసం కూడా అప్పు చేసిన, పంటలు గిట్ల ఎండిపోతే అప్పులు ఎలా తీర్చాలి. ప్రభుత్వం ఇప్పటికైనా జాగ్రత్తపడి చెరువు, కుంటల్ల నీళ్లు విడవాలి. ఎండిన పంటకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి నాలాంటి రైతులను ఆదుకోవాలి.
-మహిపాల్‌రెడ్డి, రైతు, నర్సాయపల్లి (సిద్దిపేట జిల్లా)