పుల్కల్, మే 10: సంగారెడ్డి జిల్లాలో సింగూ రు ఎడమ కాలువ, బ్రాంచ్ కెనాల్స్ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 49 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, కాలువల్లో నెలల తరబడి పొదల తొలిగింపు, చదును పనులతోనే కాంట్రాక్టర్లు సరిపెడుతున్నారు. సీసీ లైనింగ్ కాలువ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించనేలేదు. దీంతో ఈసారి ఆయకట్టుకు సాగుకు నీరందడం కష్టమేనా అంటూ రైతులు నిట్టూరుస్తున్నారు. ఇప్పటికే ఆయకట్టు రైతులు రెండు పంటలు కోల్పోయారు. వర్షాకాలం సమీపిస్తున్నా పనుల్లో పురోగతి కరువైంది.
రూ.175 కోట్లతో పనులు…
సింగూరు వరద కాలువ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.175 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో సింగూరు ఎడమ కాలువతో పాటు బ్రాంచ్ కెనాల్స్ ఆధునీకరణ పనులు చేపడతారు. గడిచిన యాసంగిలోనూ మరమ్మతుల పేరిట సింగూరు ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలక పోవడంతో వరద కాలువల కింద 32,250 ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేయలేక పోయారు. మరో 10వేల ఎకరాల్లో బోర్ల కింద రైతులు పంటలు వేశారు. కానీ, భూగర్భ జలాలు అడుగంటి బోర్ల నుంచి నీళ్లురాక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు.
సింగూరు ప్రధాన కాలువ అయిన మోడల్ స్కూల్ నుంచి బస్వాపూర్ మధ్యన ప్రస్తుతం సీసీ లైనింగ్ కోసం లెవలింగ్ పనులు చేస్తున్నారు. పరిస్థితులను చూస్తుంటే ఈ వర్షాకాలంలో కూడా సింగూరు కాలువ పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. యుద్ధప్రాతిపదికన పనులు చేపడితే కనీసం వర్షాకాలం నాటికైనా 15వేల ఎకరాలకు సాగు నీరందించే అవకాశం ఉంటుంది. సింగూరు ప్రధాన కాలువకు దగ్గరలో ఉన్న ముద్దాయిపేట, పోచారం, పుల్కల్, బస్వాపూర్, ముదిమాణిక్యం గ్రామాలకు సాగునీరందించే అవకాశం ఉంటుంది. పూర్తిస్థాయిలో ఇవ్వలేక పోయినా కనీసం కొన్ని గ్రామాలకు వర్షాకాలంలో పంటలకు సాగు నీరందిస్తే రైతులు నష్టపోకుండా ఉంటారు.
ముంచుకొస్తున్న వానకాలం..
మరో నెల రోజుల్లో వానకాలం రానున్నది. ఈనెల 20 నుంచే ఈదురు గాలుల తో పాటు వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో సింగూరు ప్రధాన కాలువ సీసీ లైనింగ్ పనులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సింగూరు ప్రధాన కాలువకు రెండువైపులా మట్టి, రోడ్డుపై మట్టి ఉండటంతో కాంక్రీట్ తీసుకెళ్లే బండ్లు, మరే ఇతర వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండదు. జూన్ 12 మృగశిర కార్తె తర్వాత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. వర్షాలు కురిస్తే పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది.
రైతులకు పరిహారం చెల్లించాలి..
సింగూరు ప్రాజెక్టు నుంచి రెండు పంటలకు సాగునీరు అందించక పోవడంతో రైతులు నష్టపోయారు. రైతులతో పాటు కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వర్షాకాలంలో రైతులకు సాగునీరు ఇవ్వని పక్షంలో రైతు భరోసా తరహాలో ఒక పంటకు కనీసం రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. కౌలుకు భూములు తీసుకున్న వాళ్లు తీవ్రంగా నష్ట పోయారు. బోర్ల కింద సాగుచేసిన రైతులు సైతం భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోయి నష్టపోయారు.
– చంటి క్రాంతికిరణ్, అందోల్ మాజీ ఎమ్మెల్యే