వెల్దుర్తి, డిసెంబర్ 23. అప్పుల బాధతో రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రామాయిపల్లిలో చోటు చేసుకుంది. వెల్దుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బత్తుల రాజు (40) తనకున్న వ్యవసాయ పొలంలో ఈ నెల 18న రెండు బోరుబావులు తవ్వించినా నీరు రాలే దు. బోర్లు తవ్విన వారికి ఇవ్వడానికి పైసలు లేక ఆదివారం ఇతరులను అప్పు అడిగినా దొరకలేదు.
పాత అప్పు రూ. 10 లక్షల వరకు ఉండగా, బోర్లతవ్వకానికి పైసలు లేకపోవడం, అప్పు దొరకక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో అందరితో కలిసి భోజనం చేసిన తర్వాత కుటుంబసభ్యులతో కలిసి నిద్రించాడు. రాత్రి 10గంటల ప్రాంతంలో రాజు తమ్ముడు కుమార్ వచ్చి రాజు భార్య రేణుకను అన్న ఎక్కడ అని అడగగా ఇంట్లో లేకపోవడంతో ఆమె కంగారుపడింది.
ఏం జరిగిందని అడగగా తమ్ముడు చల్ల మహేశ్‌కు ఫోన్ చేసి అప్పులు ఎక్కువయ్యాయి, నేను చనిపోతున్నా అని చెప్పాడని రేణుకకు తెలిపాడు. రాజు కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి వెతకగా గ్రామశివారు పటేల్‌కుంట కట్టకింద చెట్టుకు ఉరి వేసుకొని రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలుపగా ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా చేసి మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రాజు భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాజుకు భార్యతో పాటు కూతురు. కుమారుడు ఉన్నారు