చేగుంట, మే 29 : తాను తెచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టడం లేదంటూ గుళికలు మింగి రైతు ఆత్మహత్యకు యత్నంచిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేటలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకా రం.. మక్కరాజిపేట అనుబంధ గ్రామం సాల్కొని చెర్వుతండాకు చెందిన రైతు రాట్ల భిక్షపతి, అతని భార్య పేరున సుమారు 80 క్వింటాళ్ల ధాన్యం విక్రయానికి మక్కరాజిపేటలోని కొనుగోలు కేంద్రానికి వారం రోజుల క్రితం తెచ్చాడు. అకాల వర్షాలు కురుస్తుండడం, ధాన్యం కాంటా ఆలస్యం అవుతుండడంతో రైతు రెండు మూడు రోజులుగా తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
మనస్తాపంతో భిక్షపతి శుక్రవారం రాత్రి ధాన్యం కొనుగోలు కేం ద్రం వద్ద గుళికలు మింగి ఆత్మహత్యకు య త్నించాడు. విషయం తెలుసుకున్న కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై చైతన్యకుమార్రెడ్డికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటనా స్థ్థలానికి చేరుకుని 108 వాహనంలో రైతు భిక్షపతిని తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. భిక్షపతికి చెందిన సీరియల్ 115 కాగా, ప్రస్తుతం 88 నడుస్తున్నదని, అతని సీరియల్ రాగానే కాంటా పెడుతామని రైతుకు చెప్పినట్లు నిర్వాహకులు తెలిపారు.