హైదరాబాద్, ఆగస్టు 18, (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయంతోపాటు పెన్షన్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పిల్లలకు ఉచిత విద్య, స్వయంఉపాధి రుణాలు అందించాలన్న ప్రతిపాదనలు ఉద్యమకారుల నుంచి ఎకువగా వచ్చాయని, త్వరలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వెల్లడించింది. కమిటీ చైర్మన్ కే కేశవరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన అత్యున్నత స్థాయి భేటీలో ఈ అంశాలపై చర్చించారు. ఇటీవల అమరజ్యోతి వేదికగా 16 రోజులపాటు సుమారు 13,000 మందికిపైగా ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, వివిధ జేఏసీలతో చేపట్టిన విస్తృత సంప్రదింపుల ఆధారంగా వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ముసాయిదా నోట్‌ను రూపొందించారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒకరికీ ప్రాధాన్యం ఇచ్చేలా ముసాయిదాలో ఉద్యమకారులను ఐదు క్యాటగిరీలుగా వర్గీకరించారు. సమావేశంలో రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రాములునాయక్ పాల్గొన్నారు.
మొదటి క్యాటగిరీ (అమరుల కుటుంబాలు): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన సుమారు 1,400 మంది అమరుల సమాచారంలో గతంలో సహాయం అందని అర్హులైన కుటుంబాలను గుర్తించి పూర్తి న్యాయం చేయడం.
రెండవ క్యాటగిరీ (గాయపడిన ఉద్యమకారులు): పోలీసు కాల్పులు, లాఠీచార్జ్ల్లో శాశ్వత అంగవైకల్యం పొందినవారు, ఆత్మహత్యాయత్నాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు.
మూడవ క్యాటగిరీ (జైలు జీవితం గడిపినవారు): తొలిదశ (1969) నుంచి మలిదశ ఉద్యమం వరకు ప్రివెంటివ్ కస్టడీ, రిమాండ్, తీవ్ర జైలు శిక్షలు అనుభవించిన వారు.
నాలుగవ క్యాటగిరీ (కేసులు నమోదైనవారు): ఉద్యమ సమయంలో వివిధ క్రిమినల్, బెయిలబుల్/నాన్-బెయిలబుల్ కేసులు ఎదుర్కొన్నవారు.
ప్రత్యేక క్యాటగిరీ: కేసులు నమోదు కానప్పటికీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రభు త్వ ఉద్యోగులు, మహిళా ఉద్యమకారులు, ధూం-ధాం కళాకారులు, సంస్థాగత భాగస్వాములు.