సంగారెడ్డి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని కొత్లాపూర్ బీసీ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం తొమ్మిదో తరగతి విద్యార్థి టి.స్వాతి(14) తరగతి గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్వాతి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ చేపట్టాలని తల్లి దివ్యవాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుకుల పాఠశాల సిబ్బంది తమ కూతురును చంపారని ఆమె ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి స్వాతి కుటుంబ సభ్యులు గురుకుల పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. డీఎస్పీ సత్తయ్య నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. గురుకుల పాఠశాల సిబ్బంది ఫిర్యాదు మేరకు సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మానసిక ఒత్తిడితోనే స్వాతి ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ సత్తయ్య తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన టి.స్వాతి(14) సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఈమె చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నది. స్వాతి శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులతో కలిసి బాగానే గడిపింది. శనివారం స్వయంపాలన దినోత్సవం ఉండడంతో సహా విద్యార్థులతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్‌లో పాల్గొం ది. శనివారం ఉదయం 5గంటలకు లేచిన స్వాతి రూల్‌కాల్ అనంతరం రెండవ అంతస్తులో తన తరగతి గదిలోకి వెళ్లింది. తరగతి గదిలోకి వెళ్తున్న ఆమెను ప్రశ్నించగా చిన్నపని ఉన్నట్లు చెప్పి వెళ్లింది. అలా వెళ్లిన స్వాతి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.
తరగతిగదిలోకి వెళ్లిన స్వాతి ఎంతకూ తిరిగి రాకపోవటంతో విద్యార్థినులు నాగరాణి, సంజన, లాస్యప్రియ రెండో అంతస్తులోని తరగతి గదిలోకి వెళ్లి కిటికీలోంచి చూడగా స్వాతి ఉరివేసుకుని కనిపించింది. దీంతో విషయాన్ని వెంటనే పీడీ సుజాత దృష్టికి తీసుకెళ్లారు. పీడీ, ఇతర సిబ్బంది వచ్చి గది తలుపును బద్దలు కొట్టారు. అప్పటికే స్వాతి మృతిచెందడంతో విషయాన్ని ప్రిన్సిపాల్ స్రవంతి దృష్టికి తీసుకెళ్లారు. స్రవంతి సంగారెడ్డి రూరల్ పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు వచ్చారు. స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జనరల్ దవాఖానకు తరలించారు.
స్వాతి ధైర్యవంతురాలు, మంచి విద్యార్థి అని, ఇలా ఆత్మహత్య చేసుకోవడం తమను దిగ్భ్రాంతికి గురిచేసినట్లు ప్రిన్సిపాల్ స్రవంతి తెలియజేశారు. స్వాతితో కలిసి చదువుకుంటున్న విద్యార్థులు లాస్యప్రియ, సంజన మాట్లాడుతూ.. స్వాతి రాత్రి పడుకునే వరకు బాగుందని, తనకు ఒంటరిగా ఉండాలనిపిస్తున్నదని తమతో చెప్పిందన్నారు. స్వాతి ఆత్మహత్య చేసుకోవడం నమ్మలేకపోతున్నట్లు విచారణకు వచ్చిన ఆర్డీవో రవీందర్‌రెడ్డి, డీఎస్పీ సత్తయ్యకు ఇదేవిషయాన్ని తెలియజేశారు. డీఎస్పీ సత్తయ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.
స్వాతి ఆత్మహత్య చేసుకున్న గదిలో క్లూస్‌టీమ్ ఆధారాలను సేకరించింది. స్వాతి పుస్తకాల్లో తన అక్క జానుకు రాసిన లేఖ దొరికిందని తెలిపారు. తన అక్క జాను జన్మదినం వరకు తాను జీవించి ఉంటానో లేదోనని స్వాతి లేఖలో రాసిందని చెప్పారు. స్వాతి మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని డీఎస్పీ సత్తయ్య తెలిపారు. స్వాతి మృతికి సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు ఆర్డీవో రవీందర్‌రెడ్డి చెప్పారు. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం అనంతరం స్వాతి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. పోస్టుమార్టం గది వద్ద కుటుంబీకులు నిరసనకు దిగారు. వీరికి సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు మద్దతుగా నిరసనలో పాల్గొని స్వాతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సాంఘిక సంక్షేమశాఖ అదనపు కార్యదర్శి తిరుపతి ప్రభుత్వ దవాఖాన వద్ద స్వాతి కుటుంబీకులను కలిసి సంతాపం తెలియజేశారు. స్వాతి కుటుంబీకులను ఆదుకుంటామని, అర్థి క సహాయం అందజేస్తామని హామీనిచ్చారు.