యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. పంటల అదును దాటుతున్నా.. బస్తా యూరియా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. విక్రయ కేంద్రాల వద్ద అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు.
పాస్‌బుక్కులు, ఆధార్ జిరాక్స్ కాపీలు, చెప్పులు, ఇటుకలు వరుసలో పెట్టి నిరీక్షించినా అరకొర యూరియా అందిస్తున్నారని వాపోతున్నారు. అసలే రానివారు మరుసటి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. యూరియా కష్టాలు మొదలై నెల దాటినా యాతన తీరలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కడుపుమండిన రైతులు నిరసనలు, ధర్నాకు దిగుతున్నారు. మరికొందరు అధికారులను నిలదీస్తున్నారు.
– సిద్దిపేట, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)