మెదక్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఏటా వానకాలం సీజన్లో నకిలీ విత్తనాల బెడద రైతులను పట్టి పీడిస్తున్నది. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి ఉంది. దీంతో నకిలీలతో రైతులు బేజారవుతున్నారు. పలు కంపెనీలకు చెందిన డీలర్లు నకిలీ విత్తనాలను గ్రామాల్లో ఎకువగా విక్రయిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు విత్తనాల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారే తప్పా గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపట్టకపోవడంతో ఏటా రైతులు వారిబారినపడి నష్టపోతున్నారు.
మెదక్ జిల్లాలో మండలాల్లో ప్రత్యేక టాస్ఫోర్స్తో తనిఖీలు చేపడున్నారు. అనుమతులు లేని విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలకు యంత్రాంగం ఉపక్రమించింది. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. గత సీజన్లో మెదక్ జిల్లాలోని నిజాంపేట మండలంలో ఓ వ్యక్తి అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తే వ్యవసాయశాఖ అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.
ఈ సీజన్లో చేగుంట మండలం రుక్మాపూర్‌లో ఓ కంపెనీ వారు దిగుబడి ఎక్కువగా వస్తుందని నమ్మబలికి రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టారు. దీంతో రైతులు ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం 10 క్వింటాళ్ల దిగుబడి రావడంతో బిత్తరపోయారు. రైతులకు ఆ కంపెనీ వారు రసీదు ఇవ్వలేదు. దీంతో తాము మోసపోయామని సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో రైతులు ఫిర్యాదు చేశారు.
మెదక్ జిల్లాలో సాగు వివరాలు…
మెదక్ జిల్లాలో 3.57 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. వరి 3.14 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా, పత్తి 35,277 ఎకరాల్లో, కందులు 1780 ఎకరాల్లో, సోయాబీన్ 112 ఎకరాల్లో, మొక్కజొన్న 2569 ఎకరాల్లో, మినుములు 670 ఎకరాల్లో, పెసర 945 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఎకువ శాతం మెదక్ జిల్లాలో వరి పంట సాగు చేస్తుండడంతో కొంతమంది వ్యాపారులు పలు రకాల విత్తన కంపెనీల పేరుతో మారెట్లో విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. వాటిలో నుంచి నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. విత్తనాల డిమాండ్‌ను బట్టి ధర తకువ చేసి అమ్ముతున్నారు.
అమాయక రైతులకు నకిలీ విత్తనాలను విక్రయించడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు మండలానికో టాస్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తహసీల్దార్, ఎస్సై, వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు. ఆయా మండల కేంద్రాల్లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు చేస్తారు. దీంతో పాటు ట్రాన్స్‌పోర్టుల వద్ద సైతం కమిటీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీ బృందాలు వచ్చే విషయం నకిలీలకు ముందే తెలియడంతో ఆ రోజు షాపులు మూసి ఉంచుతున్నారు. దీంతో నకిలీలను పూర్తిగా అడ్డుకోవడం యంత్రాంగానికి కూడా సాధ్యం కావడం లేదు.
రసీదు తప్పనిసరి..
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నష్టం వాటిల్లినప్పుడు రసీదు ఉంటేనే ప్రభుత్వం తరపున సాయం అందే వీలుంటుంది. సంబంధిత కంపెనీపై కేసు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో నకిలీ విత్తనాలతో అకడకడ రైతుల నష్టపోతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నా విచారణ దశకు వచ్చే సరికి కేసు నీరుగారుతోంది. కొనుగోలు దారుల వద్ద ఎలాంటి రసీదు లేకపోవడమే కారణం. గ్రామాలకు వచ్చి విత్తనాలను విక్రయిస్తున్న వ్యాపారులు రైతులకు ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు. అవగాహన లేమి కారణంగా రైతులకు నష్టం వాటిల్లుతోంది. విత్తనాల ప్యాకెట్లపై ఎకడ తయారు చేశారు, ఎకడ ప్యాకింగ్ చేశారు, ఎవరు మారెట్ చేస్తున్నారనే సమాచారంతో పాటు అందులో మొలక శాతం, జెన్యూ స్వచ్ఛత తదితర విషయాలను ముద్రించాలి. విత్తన కంపెనీలు నిబంధనలు పాటించకుండా పుట్టగొడుగుల్లా మారెట్లోకి వస్తుండడంతో రైతులకు నష్టం జరుగుతున్నది.
నష్టపోయిన పంటల పరిశీలన
చేగుంట, నవంబర్ 10: కొత్త రకం విత్తనాలు వేసి పంటను పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదనపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనానికి మెదక్ జిల్లా వ్యవసాయ అధికారులు స్పందించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్‌కు చెందిన కొందరు రైతులు కొత్త రకం విత్తనాలతో అధిక దిగుబడి వస్తుందని నమ్మి పంట వేశారు. అంతేకాకుండా ప్రభుత్వ మద్దతు ధర కంటే అధిక ధరతో పంటను కొనుగోలు చేస్తామని విత్తన విక్రయదారులు చెప్పడంతో ఆశతో రైతులు వరి పంట వేశారు. రుక్మాపూర్‌కు చెందిన 40మంది రైతులు వరి రకం 45, 47 అనే వరి విత్తనాలతో వరి పంట వేశారు. మొదటగా పచ్చగా వచ్చిన పైరు, పిలకలు వచ్చే సమయానికి చాలా తక్కువ రావడంతో పాటు పంట ఎండి పోవడంతో రైతులకు తీవ్ర నష్టపోయారు. దీనిపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథానానికి మెదక్ జిల్లా వ్యవసాయాధికారి దేవికుమార్ స్పందించారు.సోమవారం బాధిత రైతుల పొలాలను ఆయన పరిశీలించి వివరాలు సేకరించారు.పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట చేగుంట మండల వ్యవసాయశాఖ అధికారి హరిప్రసాద్,యాదగిరి,బాధిత రైతులు ఉన్నారు.
విత్తనాలు, ఎరువులకు రసీదు తప్పనిసరి..
రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలి. రైతులకు నష్టం వాటిల్లినప్పుడు రసీదు ఉంటేనే ప్రభుత్వం తరపున సాయం అందుతుంది. కోర్టుల్లో కేసులు వేయవచ్చు. జిల్లాలో మండలానికో టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించాం. కమిటీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై
పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.
– దేవ్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మెదక్