దుబ్బాక, సెప్టెంబర్ 13 : ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లతో ప్రచారం చేస్తుందని, వారి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ జాగృతులుగా ఉండాలని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. బుధవారం దుబ్బాకలోని రజనీకాంత్‌రెడ్డి ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గం సోషల్ మీడియా వారియర్స్‌కు సోషల్ మీడియాపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు దుబ్బాక నియోజకవర్గం నుంచి పార్టీ సోషల్ మీడియా వారియర్స్‌తో పాటు పార్టీ యువజన నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరిటా గ్రూప్ అకౌంట్ల గురించి, బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై సోషల్ మీడియా నిర్వాహకులు జగన్ మోహన్‌రావు, రజినీకాంత్ అవగాహన కల్పించారు.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరిట ఉన్న వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ గ్రూప్‌లలో సభ్యులుగా ఉండటంతో మరికొంత మందిని చేర్పించాలని సూచించారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్న కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పోస్ట్ చేయటంతో పాటు వాటికి సంబంధించిన వీడియోలను లైవ్‌లో పెట్టేందుకు వారియర్స్ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు. వాటికి సంబంధించిన పలు వీడియోలను, ఎమ్మెల్యే రఘునందన్‌రావు దుబ్బాక ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించిన మేనిఫెస్టో తదితర వాటిని వారియర్స్‌కు చూపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని, వాటిని తప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. నాడు గత ప్రభుత్వాల్లో..నేడు కేసీఆర్ సర్కారులో జరిగిన అభివృద్ధి పనులను నాడు-నేడు ఫొటోలు, వీడియోలను సేకరించి సోషల్ మీడియాలో పెట్టాలని సూచించారు.
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ (తప్పుడు ప్రచారాలు) పోస్టులు చేస్తూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పబ్బం గడుపుతున్నాయని, ఆ పార్టీలకు పదవులు తప్ప ప్రజల సమస్యలు పట్టింపులేదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వచ్చేది ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సర్కారేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజల వద్దకు వెళ్లే ముఖం లేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. నిజం నిద్ర లేచేసరికే అబద్ధం ఆమడ దూరం పోతుందన్న చందంగా.. నేడు సోషల్ మీడియాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మారాయని మండిపడ్డారు. తొంభై ఏండ్లలో చేయలేనటువంటి అభివృద్ధి, సంక్షేమం కేవలం తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. దేశం లో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలుచేస్తూ.. ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారని కొనియడారు. గ్రామాల్లో హనుమాన్ ఆలయం ఉందో లేదో కానీ రాష్ట్రంలో కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదన్నారు.
దేశంలో ఎక్కడలేని ప్రగతి మన తెలంగాణ రాష్ట్రం సాధిస్తే.. ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని విమర్శించారు. ముల్లును ముల్లుతోనే తీసేందుకు బీఆర్ఎస్ వారియర్స్ సంసిద్ధ్దంగా ఉండాలని, బీజేపీ, కాంగ్రె స్ ఫేక్ న్యూస్‌లు, పోస్టులపై స్పందించి వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. గత ఉప ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియాలో చేసిన తప్పుడు ప్రచారాలు బీఆర్ఎస్కు నష్టం చేకూర్చిందని, అలాంటి సంఘటనలకు తావు లేకుండా బీఆర్ఎస్ వారియర్స్ జాగృతులుగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమన్నారు. పార్టీకి రక్షణగా యువజన నాయకులు, వారియర్స్ మరో ముందడుగు వేయాలని కోరారు. పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీ లక్ష్యంగా పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని కోరారు. ఆనంతరం దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై రూపొందించిన ఆడియో పాటల సీడీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మనోహర్‌రావు, రొట్టే రాజమౌళి, బక్కి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.