అమీన్పూర్, మార్చి 29: సీసీఎల్ఏ అధికారినంటూ, సీఎం పేషీ నుంచి వచ్చానంటూ అమీన్పూర్లో వారం రోజుల పాటు హల్చల్ చేసిన నకిలీ అధికారి అనిరుధ్‌ను అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, అతడు అమీన్పూర్ ప్రాంతంలో అనేక మంది అధికారులు, బిల్డర్లను, అధికారులకు నిద్రపోకుండా చేయడం గమన్హరం. రెవెన్యూ పరమైన అంశాలపై ఉన్న అవగాహనతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారుల వద్ద హల్చల్ సృష్టించాడు. తాను సీఎం రేవంత్‌రెడ్డి పేషీ ప్రత్యేకాధికారినని, అక్కడి నుంచి వచ్చానంటూ భూరికార్డులు అందచేయాలని ఏకంగా అమీన్పూర్ రెవెన్యూ అధికారులకు హుకుం జారీచేశాడు.
అక్రమ నిర్మాణాలు,ప్రభుత్వ భూముల అక్రమణలు, ఎఫ్టీఎల్, బఫర్ భూములు, నాలాలకు సంబంధించి పూర్తి అవగాహనతో మాట్లాడి అధికారులను బోల్తా కొట్టించాడు. అతడి తీరుతో స్థానిక అధికారులు ఆందోళనలకు గురయ్యారు. పూర్తి రికార్డులు అతడికి ఇవ్వడంతో పాటు అతడి వెంట క్షేత్రస్థాయిలో సర్వేకు సైతం అధికారులు వెళ్లడం విశేషం. అమీన్పూర్ మండలంలోని పటేల్‌గూడ పంచాయతీలో స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలంటూ జేసీబీ వెంట తీసుకెళ్లి మరీ రెండు భవనాలను కూల్చివేయించడం విశేషం. అమీన్పూర్ పోలీసులు అనిరుధ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ అధికారి అని తేలింది. ఈ వ్యవహారం అమీన్పూర్ మండలం, మున్సిపాలిటీలోనే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అనిరుధ్ కొంతకాలం సీసీఎల్ఏ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసి రెవెన్యూ వ్యహారాలపై పూర్తి అవగాహన పెంచుకున్నట్లు తెలిసింది. దీంతో అతడ్ని అడ్డుగా పెట్టుకుని అమీన్పూర్లో జరుగుతున్న అక్రమాలపై అధికారులు, బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేసి సొమ్ము చేసుకునేందుకు అతడి వెనకాల ఉండి ఓ స్థానిక న్యాయవాది ఈ తతంగం నడిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపడితే ఆసలు దొంగలు బయటకు వస్తారని, అందువల్ల ఫేక్ అధికారులు పుట్టుకురారని పేర్కొంటున్నారు. వారం రోజులుగా అనిరుధ్ సీసీఎల్ఏ ఫేక్ అధికారిగా అవతారమెత్తి అనేక కార్యాలయాలు, అధికారులను భయాందోళనకు గురిచేసినా ఏ ఒక్క అధికారి కనిపెట్ట లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ ఘటన అధికారులను నవ్వులపాలు చేసిందని చెప్పవచ్చు.