పటాన్చెరు రూరల్, జూలై 3: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కంపెనీలో చోటుచేసుకున్న భారీ పేలుడు దుర్ఘటనలో పెద్దఎత్తున కార్మికులు, సిబ్బంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిగాచి కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి నలుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు సీఎస్ఐఆర్-ఐఐసీటీ ఎమిరైటస్ సైంటిస్ట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్రావు, సీఎస్ఐఆర్-ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ టి.ప్రతాప్‌కుమార్, సీఎస్ఐఆర్-సీఎల్ఆర్ఐ రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ సూర్యనారాయణ, సీఎస్ఐఆర్-ఎన్సీఎల్ పూనే సేఫ్టీ ఆఫీసర్ సంతోష్ గూగెలతో రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ గురువారం సిగాచి పరిశ్రమను సందర్శించి పేలుడు జరిగిన ప్రాంతాన్ని సునిశితంగా పరిశీలించింది. తెలంగాణ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ ఆధ్వర్యంలో భద్రత సిఫార్సుల కమిటీ సైతం పర్యటించింది. భారీ పేలుడు జరగడంపై దర్యాప్తు నిర్వహించారు. పరిశ్రమ సేఫ్టీ అధికారులతో, ప్రొడక్షన్ శాఖ అధికారులతో కమిటీ సభ్యులు మాట్లాడారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎంతమంది కార్మికులు ఉన్నారు. పేలుడు ఏ సమయంలో జరిగింది. ఎక్కడ ఎక్కువ నష్టం జరిగింది.
సమస్యకు కారణం ఏమిటి, పేలుడు తీవ్రత, దానికి కారణం, ఇతర అంశాలను వారు ఆరాతీశారు. ప్రధానంగా అక్కడ జరిగిన లోపాలను కనుక్కునే ప్రయత్నం చేశారు. విస్తారమైన అనుభవం ఉన్న నిపుణులు కావడంతో వీరి నివేదిక కీలకంగా మారనున్నది. ఈ కమిటీ మరి కొన్నిసార్లు దర్యాప్తునకు వచ్చే అవకాశం ఉంది. మరణించినవారి వివరాలు సేకరించారు. ఈ కమిటీ గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పరిశ్రమలో అన్నిచోట్ల తిరిగి రిపోర్టులు రాసుకుంది. అభిప్రాయాలు సేకరించింది. అనంతరం కమిటీ మీడియా ఉన్న ద్వారం వైపుగా కాకుండా మరో ద్వారం గుండా వెనుదిరిగింది.
నిపుణుల కమిటీ నిబంధనలు రూపొందిస్తుంది. దాంతో పాటు పలు సూచనలు చేస్తుంది. భవిష్యత్తులో పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు జరగకుండా నిబంధనలను సిఫార్సు చేస్తుందని సమాచారం. భారీ ప్రాణ నష్టానికి గల కారణాలను విశ్లేషించి ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తుంది. సిగాచి పరిశ్రమలో భద్రతా లోపాలు గుర్తిస్తుంది. పారిశ్రామిక యూనిట్లలో కార్మికుల భద్రతకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు (ఎస్వోపీ) పాటిస్తున్నారా..? లేదా అనేది విచారణలో తేలుస్తారు.
పారిశ్రామిక వాడల్లో రసాయన పరిశ్రమలు, పారిశ్రామిక వాడల్లో నిబంధనల అమలు, ఉల్లంఘనలపై, అధికారుల తనిఖీలపై వారు రిపోర్టులు సిద్ధం చేస్తారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా పారిశ్రామికవాడల్లో భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ఈ రిపోర్టు సహాయం చేస్తుందని, కొత్త భద్రతా ప్రమాణాలు శాస్త్రీయంగా అమలవుతాయని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల కమిటీ సిఫార్సులతో కొత్త రూల్స్‌ను పరిశ్రమల్లో తెచ్చే అవకాశం ఉంది.