చేగుంట, మే 21: కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యానికి మెదక్ జిల్లాకు చెందిన రైతు సంతోశ్ కష్టాలే నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే… చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్ గ్రామానికి చెందిన సంతోశ్ సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ అన్నపూర్ణ రైస్‌మిల్లుకు గ్రామం నుంచి ఐదు లారీల ధాన్యం పంపించి ఐదు రోజులైనా ప్రభుత్వ కొనడం లేదని, అధికారుల జాప్యంతో వర్షానికి ధాన్యం మొలకెత్తిందని, ఇప్పుడు కొనడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారన్నారు.
సంతోశ్ కాళ్లావేళ్లా పడితే లారీకి 50బస్తాలు తరుగు తీస్తేనే కొంటామని, లేకపోతే కొనమని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం సరికాదన్నారు. ఐదు రోజులుగా డ్రైవర్‌కు భోజన వసతిని సంతోశ్‌తోపాటు గ్రామస్తులు భరిస్తున్నారన్నారు. ప్రభుత్వం మొలకెత్తిన వడ్లను కొంటామని చెబుతున్నా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. సంతోశ్ ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడని ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. మెదక్, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు స్పందించి రైతు సంతోశ్ సమస్యను పరిష్కరించాలని కోరారు.