Medak | ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి : మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ : ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నెహ్రూ యువక కేంద్రం, జిల్లా యువజన క్రీడల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ కళాశాల మైదానం నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించిన ఫిట్ ఇండియా రన్ 2.0ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతోపాటు వివిధ పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు సభలో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ పరాయి పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుని 75 వసంతాలు అవుతున్న సందర్భంగా ఆనాటి త్యాగమూర్తులను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు తరాలకు దేశ సంస్కృతి, ఔన్నత్యాన్ని తెలుపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా వివిధ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకొని దేశ, రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.
జిల్లాలోని 75 గ్రామాల్లో కార్యక్రమాలు : అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లాలోని 75 గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జిల్లాలో మరుగున పడిన, చరిత్రకెక్కని ఘటనలతో పాటు ఎవరైనా స్వాతంత్య్ర సమరయోధుల వివరాలు ఉంటే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని కోరారు. అంతకు ముందు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి జిల్లా అధికారి బెన్సీ తదితరులు మాట్లాడారు.
ఆకట్టుకున్న 75 మీటర్ల జాతీయ పతాకం
ఈ సందర్భంగా జూనియర్ కళాశాల నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు కావడంతో ఈ ర్యాలీలో ప్రత్యేకంగా తయారు చేసిన 75 మీటర్ల జాతీయ పతకాన్ని ప్రదర్శించారు. అంతే కాకుండా 75 మంది స్వాతంత్య్ర సమర యోధుల చిత్రపటాలను ప్ల కార్డుల ద్వారా ప్రదర్శించారు. 75 మీటర్ల జాతీయ పతాకం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి జిల్లా అధికారి బెన్సీ, కో-ఆర్డినేటర్ కిరణ్‌కుమార్, జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ ఏలేటీ రాజశేఖర్‌రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్, డీపీవో తరుణ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్‌నాయక్, బీసీ వెల్ఫేర్ అధికారి జగదీశ్, మెదక్ డీఎస్పీ సైదులు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మున్సిపల్ కౌన్సిలర్లు మామిళ్ల ఆంజనేయులు, జయరాజ్, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ శ్రీధర్‌యాదవ్, రాంచరణ్‌యాదవ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌గౌడ్, పీఈటీలు, నెహ్రూ యువజన సంఘాల కో-ఆర్డినేటర్లు, ఎంఎల్ఎన్ రెడ్డి, జూబేద్, గంగాధర్, కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.