పటాన్చెరు రూరల్, ఫిబ్రవరి 12: బాహుబలి సినిమాలో కట్టప్ప అనే పాత్ర వెనుకనుంచి వెన్నుపోటు పొడిచి కథానాయకుడిని చంపడం ఎలా ఉందో, అచ్చం అలాంటి సన్నివేశాలు పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లోని చైర్మన్ అభ్యర్థులపై ప్రయోగించబడ్డాయని సమాచారం. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారంలో మున్సిపల్ ఎన్నికల సంగ్రామం జరిగింది. బుధవారం 11న జరిగిన పోలింగ్‌తో చైర్మన్ అభ్యర్థులం అని చెప్పుకున్న అభ్యర్థుల్లో భయం ఏర్పడింది.
ముఖ్యంగా అధికార కాంగ్రెస్ అభ్యర్థుల్లో సొంత పార్టీవారే వెన్నుపోట్లు పొడిచారనే వాదన వినిపిస్తున్నది. ముందస్తుగా తామే చైర్మన్ అభ్యర్థులం అంటూ ప్రకటించుకొన్న అభ్యర్థుల పరిస్థితి గెలవడమే గగనం అన్నట్టుగా మారింది. ఒక బడ్జెట్లో వార్డులో గెలుస్తాం అనుకున్న చైర్మన్ అభ్యర్థులకు మారిన పరిణామాలు వెన్నులో చలిపుట్టించాయి. అన్నా… నీవు ఓడిపోయే అవకాశం ఉందని అనుచరులు తీసుకొస్తున్న సమాచారం, పార్టీ వర్గాల సర్వే రిపోర్టులతో ఖంగుతిని ఓటరు అడిగినంత సమర్పించుకున్నారు.
పెద్ద నాయకుల్లో ఓటమి భయం..
అధికార పార్టీలో కీలకం అంటున్న నాయకుడి సతీమణి ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా నిలబడింది. మొదటగా తక్కువ ఖర్చులో ఎన్నిక అయిపోతుందని భావిస్తే, సొంత పార్టీవారే ఆ వార్డులో పొగబెట్టారని సమాచారం. ఈ నాయకుడి భార్య గెలిస్తే తమకు చైర్మన్ అవకాశాలు తగ్గుతాయని భావించి, ఎదురు ఖర్చు చేసి ప్రత్యర్థి పార్టీలకు ఓటేయాలని సొంతపార్టీ నాయకులే చీకట్లో ప్రచారం చేసినట్టుగా వినికిడి. అదే గ్రామంలో చైర్మన్ పదవిని ఆశిస్తున్న మరో నాయకుడికి వెన్నుపోట్లు తప్పలేదని గ్రామంలో చెప్పుకొంటున్నారు. తన సతీమణికి చైర్మన్ పదవిని ఆశిస్తున్న నాయకుడు భార్యతో పాటు తాను టికెట్ తెచ్చుకొని రెండు వార్డుల్లో పోటీ చేశారు. వారిద్దరిలో చివరికి ఒకరే గెలుస్తారనే సర్వే రిపోర్టుతో తలలు పట్టుకుంటున్నారు.
పారిశ్రామిక గ్రామంలో ఓటమి ఎరుగని నాయకుడి భార్య చైర్మన్ కావొద్దని సొంతపార్టీ నాయకులే ప్రత్యర్థులకు సహకరించినట్టుగా తెలుస్తున్నది. ఒక్కో మున్సిపాలిటీలో ఇద్దరికి మించి అభ్యర్థులు మున్సిపల్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకోవడంతో వెన్నుపోట్లు రుచిచూడాల్సి వస్తున్నది. ఒక పెద్ద నాయకుడు తన భార్య ఓడిపోతుందని వస్తున్న వార్తలతో ఓటుకు రూ. 20 వేల నుంచి రూ.30వేల వరకు పంచినట్టుగా సమాచారం. రూ.లక్షల్లో ఖర్చు అనుకున్న అధికార పార్టీ నాయకులకు, ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రతిపక్ష పార్టీల జోరు అధికార పార్టీ అభ్యర్థులకు కునుకు దూరం చేసింది. శుక్రవారం వచ్చే ఫలితాలపై కొండంత ఆశతో ఉన్నారు. ప్రజాతీర్పు ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఉత్సుకత నెలకొన్నది. పారిశ్రామికవాడల్లో మాత్రం కట్టప్పల వెన్నుపోట్లపై చర్చలు జరుగుతున్నాయి. కొసమెరుపు ఏమిటంటే సాదారణంగా నామినేషన్లు వేసిన అభ్యర్థులకు ఖర్చు తక్కువగా వచ్చింది.