నారాయణఖేడ్, మే 11: ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. మండల కేంద్రమైన నిజాంపేట్‌లోని డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయడంతో పాటు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. కాగా, కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న రవీందర్ సింగ్, కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని గ్రామంలోని సాయి గణేశ్ బిన్నీ రైస్‌మిల్లుకు అనుమతి ఇవ్వాలని స్థానికులు కోరగా అప్పటికప్పుడు పౌరసరఫరాల డీఎం సుగుణబాయి, డీఎస్వో వనజాతలకు రవీందర్‌సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయనవెంట వైస్‌ఎంపీపీ సాయిరెడ్డి, నిజాంపేట్ సర్పంచ్ జగదీశ్వర్‌చారి ఉన్నారు.