న్యాల్కల్, అక్టోబర్ 2: బోరు, బావుల కింద రెండు, మూడు పంటలు పం డే పచ్చని భూములను ఫార్మాసిటీకి ఇచ్చేందుకు సంగారెడ్డి జిల్ల న్యాల్కల్ మండలంలోని వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన రైతులు నిరాకరిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసే పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తమ భూములను లాక్కునేందుకు ప్రయ త్నం చేస్తున్నదంటూ రైతులు మండిపడుతున్నారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం 90 శాతం భూమి సాగుకు పనికిరాని, 10శాతం భూమి సాగుకు అనుకూలమైనది సేకరించవచ్చని పేర్కొందని రైతులు అంటున్నారు. కానీ, ఫార్మాసిటీ కోసం ప్రతిపాదించిన 2003 ఎకరాల్లో 85శాతం మేరకు సాగుకు అనుకూలంగా, 15 శాతం ఎండు, మూడు పంటలు పంటలు పండే భూములున్నాయని తెలిపారు. తమకు ఉన్న అర ఎకరం, ఎకరా, రెండు ఎకరాలకు పైగా ఉన్న భూములని ప్రభుత్వం ఫార్మాసిటీకి తీసుకుంటే తామెలా బతకాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫార్మాసిటీ కోసం 2003 ఎకరాల భూమి సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో న్యాల్కల్ మండలంలోని మల్గి గ్రామంలో 282.13 ఎకరాలు, వడ్డి గ్రామంలో 256.01 ఎకరాల ప్రభుత్వ, పట్టాభూములను సేకరిస్తున్నది. అయితే డప్పూర్ గ్రామంలోనే అధికంగా రైతులు భూములను కోల్పోతున్నారు. ఈ గ్రామం లో 2800 ఎకరాల భూమి ఉంది. అందులో 920 ఎకరాల ప్రభుత్వ భూమి, 516 ఎకరాల పట్టాభూమిని ఫార్మాసిటీ కోసం సేకరించేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను జారీచేసింది. ఫార్మాసిటీకి సేకరించే భూముల్లోనే రెండు, మూడు పంటలను సాగు చేసుకుంటూ బతుకుతున్నారు.
డప్పూర్ గ్రామ సమీపంలోని 80 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద చేరడంతో చెరువు నీటితో కళకళలాడుతోంది. చెరువుల పరిధిలో భూగర్భ జలాలు పెరగడంతో 100 బోర్లు, 150 బావుల కింద రైతులు పంటలను పండించుకుంటున్నారు. డప్పూర్ గ్రామ పరిధిలోని 15 వరకు చెక్డ్యామ్లతో పాటు న్యాల్కల్, నక్కల, కోట, చాకలి వాగుల కింద పారే నీటిని పంపు సెట్ల ద్వారా పొలాలకు నీటి తడులను పెట్టుకుంటున్నారు.
వ్యవసాయమే జీవనాధారంగా పత్తి, కంది, సోయాబీన్, మినుము, పెసర, మొక్కజొన్న, అలుగడ్డ, ఉల్లిగడ్డతోపాటు కూరగాయలు పండిస్తున్నారు. పాడిపశువులు, మేకలు, గొర్రెల పెంపకంతో జీవనాన్ని సాగిస్తున్నారు. భూమి, నీరు, గాలి కాలు ష్యం చేసి తమను కాలుష్య కోరల్లోకి నెట్టే ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రాణా లు పోయినా భూములు ఇచ్చేది లేదని రైతులు ఖరాఖండీగా చెబుతున్నారు. ఫార్మాసిటీతో భూములను కోల్పోవడంతో పాటు బోరు, బావులు పోతాయని, తమ జీవితాలు రోడ్డు పాలవుతాయని, ఈ ప్రాంతంలో కాలుష్యం పెరిగి ప్రజారోగ్యం దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మాసిటీ ప్రతిపాదన విరమించుకుని తగిన న్యాయం చేయాలని రైతులు రాష్ట్ర ప్ర భుత్వాన్ని కోరుతున్నారు.
పచ్చని పంటలతో కళక ళలాడే భూములపైనే మా కుటుంబం ఆధారపడి ఉంది. మాకు జీవనాధారమైన భూములను ఫార్మాసిటీకి లా క్కుంటే మేం ఎలా బతకాలి. ఏడాదికి రెండు, మూడు పంటలు పండించుకుంటున్నాం. మాకు ఉన్న ఐదు ఎకరాలను ఫార్మాసిటీకి తీసుకుని పొట్ట కొట్టొ ద్దు. మా భూముల్లో ఫార్మా కంపెనీలు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు చేయద్దు. ఫార్మాసిటీ ఏర్పాటును ప్రభు త్వం వెంటనే విరమించుకోవాలి
– పండరి, రైతు, డప్పూర్, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా