ఝరాసంగం, జూన్ 19: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయం అభివృద్ధి కుంటుపడుతున్నది. ఆలయానికి ఏడాదికి సుమారు రూ.4 కోట్ల ఆదాయం వస్తున్నా, అధికారులు దాదాపు అంతే మొత్తంలో ఖర్చులు చూపిస్తున్నారు. కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి, ఆ ఆదాయానికి పొంతన లేదని, అభివృద్ధి పేరుతో నిధులు పక్కదారి పట్టిస్తున్నారని సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్, భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆలయంలో కనిపిస్తున్న అంతర్గత షెడ్లు, వెలుపల నిర్మించిన షెడ్లు, గ్రానైట్ ఫ్లోర్లింగ్ వంటి ఇతర పనులన్నీ భక్తులే సొంత డబ్బులతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయించారని, ఆలయ నిధుల ద్వారా, పాలకమండలి ద్వారా జరిగిన అసలైన అభివృద్ధి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈవో స్థానిక నాయకులు, కొన్ని ఇతర శక్తుల నుంచి వస్తున్న రాజకీయ, సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గి సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక బంధుత్వాలు, ఒత్తిళ్ల కారణంగానే ఆలయ ప్రయోజనాలను పక్కనపెట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతోనే ఆలయ అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు ఉన్నాయి. గత మహాశివరాత్రి జాతర సందర్భంగా ఆలయ రథం గోపురం (శిఖరం) ఊడిపోయి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ, దానికి కొత్తది ఏర్పాటు చేసే ప్రయత్నం కానీ, మరమ్మతులు చేపట్టకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని భక్తులు మండిపడుతున్నారు. కనీసం తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేయకుండా రథాన్ని అలాగే వదిలేశారని ఆరోపిస్తున్నారు.
ఏటా శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వివిధ రకాల పనులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచేవారు, కానీ.. ప్రస్తుత ఈవో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టెండర్లు వేయలేదని, దాని వెనుక ఉన్న మతలబు ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంలో కొందరిని నిబంధనలకు విరుద్ధంగా నియమిస్తున్నారని, దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్‌కు స్వయంగా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేయక పోవడంతో పాటు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
గతంలో కూడా ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై విసుగు చెందిన కొందరు భక్తులు ఆలయ ఈవో, అర్చకులపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖకు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. స్థానిక నాయకుల అండదండలతో ఆలయంలో దళారులు, అనధికార పూజారులు భక్తులపై దౌర్జన్యాలకు దిగుతూ గూండాయిజం చేస్తున్నారని, అభిషేకాలు, అర్చనలు, వాహన పూజలు, గుండం స్నానాల వద్ద ఎలాంటి రసీదులు ఇవ్వకుండా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
గతంలో మాజీ ఎంపీటీసీ ఆరోపించినా, కనీసం వారిపై చర్యలు కూడా తీసుకోలేదన్నారు. ప్రస్తుతం కేతకీ ఆలయానికి గ్రేడ్-2 స్థాయి ఈవో ఇన్చార్జిగా వ్యవహరిస్తుండటంతో పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని, ఆలయ అభివృద్ధి దృష్ట్యా ఈవో తీరుపై సమగ్ర విచారణ జరిపి, ఆలయ గ్రేడ్‌కు అనుగుణంగా పూర్తిస్థాయి గ్రేడ్-1 రెగ్యులర్ ఈవోను నియమించినప్పుడే, కేతకీ క్షేత్రం అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందని భక్తులు, నాయకులు అంటున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆలయ సమగ్రాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.