చేపలు పట్టుకునేందుకు చెరువు నీళ్లను ఓ కాంట్రాక్టర్ ఖాళీ చేసే కుట్ర చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయకట్టు రైతులు వచ్చి అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు తూము తెరవడంతో పాటు చెరువు లోపల గండికొట్టి తూములోకి నీళ్లు వచ్చేలా చేసి నీటిని బయటకు వృథాగా వదులుతున్నా పట్టించుకునేవారు లేరు. చెరువు ఎండిపోతే చుట్టుపక్కల బావులు, ఆయకట్టులోని బావులు పూర్తిగా ఎండిపోయి పశువులకు సైతం నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని తెలిసి కూడా ఓ కాంట్రాక్టర్ కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
హుస్నాబాద్, మే 28: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు ఈ ప్రాంతంలోనే అతిపెద్ద చెరువు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5వేల ఎకరాల ఆయకట్టు భూములకు చెరువు సాగునీరందిస్తున్నది. హుస్నాబాద్ పట్టణ వాసులకు కూడా ఈ నీళ్లే ఆధారం. ఇలాంటి చెరువు నుంచి పంటలకు కాకుండా వృథాగా నీటిని బయటకు వదలడంపై ఆయకట్టు రైతులతో పాటు పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులోని చేపల కాంట్రాక్టు పట్టిన కాంట్రాక్టర్ తన స్వలాభంకోసం రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చెరువులోంచి అక్రమంగా నీటిని వదులుతున్నారని పలువురు ఆయకట్టు రైతులు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసి 24గంటలు గడుస్తున్నా స్పందన కరువైంది. కాంట్రాక్టర్ జేసీబీతో కొట్టిన గండిన పూడ్చి వేసి తూము ద్వారా నీళ్లు బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని కోరినా అధికారులు స్పందించడం లేదు. ఉన్న కొద్దిపాటి నీరు బయటకు వెళ్లిపోతే తమ పశుపక్ష్యాదులకు నీళ్లు లేకుండా పోతాయని, ఈ ఏడు కూడా వానలు పడకుంటే మా పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టరు పెట్టిన గండిని ఇప్పటికీ అధికారులు పూడ్చకపోవడం విశేషం. వానలు పడి చెరువులోని కొత్త నీళ్లు వచ్చేదాక ఉన్న నీళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు. మిషన్‌భగీరథ నీళ్లు సరిపోనప్పుడు చెరువులో గల బావి నుంచి నీళ్లను హుస్నాబాద్ పట్టణ వాసులకు సరఫరా చేస్తున్నారు. చెరువు ఎండిపోతే నీటి సరఫరా ఉండదని పట్టణ వాసులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి విడుదలను ఆపివేయాలని కోరుతున్నారు.
ఎల్లమ్మ చెరువులో చేపలు పట్టుకునే కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్ మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు చెప్పి నీటి పారుదల శాఖ అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నాడని పేరు చెప్పడం ఇష్టం లేని ఓ అధికారి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. మంత్రి చెప్పినా నువ్వు నీళ్లను బయటకు వదలవా, నీ సంగతి చూస్తా అంటూ బెదిరిస్తున్నాడని, దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని సదరు అధికారి తన ఆవేదనను వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కాంట్రాక్టరు తరపున మంత్రి ఎలా మాట్లాడుతాడనేది చర్చనీయాంశమైంది. వానకాలంలో వర్షాలు ఆలస్యంగా కురిసినా ఆయకట్టు రైతులకు ఉపయోగపడే చెరువు నీళ్లను బయటకు పంపాలని మంత్రి అధికారులకు ఎలా చెప్తాడనేది రైతులు చర్చించుకోవడం విశేషం. అవసరమైతే మంత్రిని కలిసి ఈ సంఘటన గురించి చెప్పేందుకు కూడా ఆయకట్టు రైతులు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.
చెరువుకు అక్రమంగా గండికొట్టి, తూము నుంచి నీటిని విడుదల చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకునేందుకు పైఅధికారులకు సమాచారం ఇచ్చాం. అనుమతి లేకుండా చెరువులో గండికొట్టడం నేరం. కాంట్రాక్టర్ కొట్టిన గండిని పూడ్చివేస్తాం. గండికొట్టడంతో పాటు తూము గేటును ఎత్తడం సరైంది కాదు. రైతులు మాకు ఫిర్యాదు చేసింది వాస్తవమే. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులకు, ప్రజలకు ఎల్లమ్మ చెరువే ఆధారం. ఒకసారి నిండిందంటే రెండేండ్ల పాటు నీళ్లుంటయ్. ఒక కాంట్రాక్టరు కోసం వందలాది మంది ఆయకట్టు రైతులకు అన్యాయం చేయడం సరైంది కాదు. అధికారుల అనుమతి లేకుండా ఒక కాంట్రాక్టరు చెరువులో జేసీబీతో గండి కొట్టి నీళ్లను వదలాడంటే అధికారుల పనితీరు ఎలా ఉందో తెలుస్తున్నది. చెరువులో నీళ్లన్నీ బయటకు పోయి ఎండిపోతే మా పశువులకు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గండిని పూడ్చివేసి ఉన్న నీటిని కాపాడాలని కోరుతున్నాం.
ఎల్లమ్మ చెరువు తూము నుంచి వృథాగా బయటకు పోతున్న నీళ్లను ఆపాలని రైతులందరం కలిసి నీటి పారుదల శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. తూములోంచి 24గంటలు ఏకధాటిగా నీళ్లు పోతున్నయ్. గండిని పూడ్చి వేసి నీళ్లు పోకుండా చేయాలని చెప్పినా అధికారుల ఇప్పటి వరకు జాడ లేరు. తూములోంచి వచ్చే నీళ్లు పంటలకు కూడా పనికి రాకుండా పోతున్నయ్. అలాంటప్పుడు నీళ్లను ఎందుకు బయటకు వదలాలి. అధికారుల అండతోనే కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా నీళ్లను వదులుతున్నాడు. అధికారులు స్పందించి గండిని పూడ్చాలి.