సిద్దిపేట, ఫిబ్రవరి 22( నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా కేంద్రం ముస్తాబాద్ చౌరస్తాలోని 220/132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పేలిన 100 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి గురువారం రాత్రి వరకు సైతం చిన్న మంటలతోపాటు పొగ వస్తూనే ఉన్నది. ఫైరింజన్‌తో రోజంతా సిబ్బంది ఆర్పే పనిలోనే నిమగ్నమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి బుధవారం రాత్రి 11:30 వరకు అక్కడే ఉండి అధికారులతో మాట్లాడి, సమస్యను పరిష్కరించి మంటలను పూర్తిగా ఆర్పిన తర్వాత విద్యుత్‌ను తాత్కాలికంగా పాలమాకుల, హబ్సిపూర్, చంద్లాపూర్, దుద్దెడ తదితర సబ్స్టేషన్ల నుంచి విద్యుత్‌ను పునరుద్ధరింపజేశారు. దీంతో సిద్దిపేట పట్టణం, గ్రామాలకు, దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా జరిగింది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గురువారం ఉదయం 220/132 కేవీ సబ్‌స్టేషన్‌లోని మిగితా160 ఎంవీఏ, 100 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి యథావిధిగా అన్ని ప్రాంతాలకూ పూర్తిస్థాయిలలో విద్యుత్‌ను ట్రాన్స్‌కో అధికారులు పునరుద్ధరించారు. సిద్దిపేటకు కరీంనగర్, గజ్వేల్, దర్శన్ నుంచి విద్యుత్ సైప్లెయ్ జరుగుతుంది. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో 1997వ సంవత్సరంలో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ను బిగించినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఇక్కడ మూడు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. రెండు 100ఎంవీఏ, ఒకటి 160ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ప్రస్తుతం100ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్లకు బదులుగా అన్ని 160 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్లు వస్తున్నాయని అధికారులు తెలిపారు. పేలిన 100 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ను స్క్రాప్‌కు పంపించామని, దానిస్థానంలో కొత్తది 160 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ బిగిస్తామని అధికారులు తెలిపారు. పేలిన ట్రాన్స్ఫార్మర్ రికార్డు ప్రకారం దాని కాస్ట్ రూ.75 లక్షలు ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఇతర సామగ్రి అన్నీ కలుపుకొని సుమారుగా రూ.3 నుంచి 4 కోట్ల వరకు నష్టం ఉంటుందని ప్రాథమిక సమాచారం.
సిద్దిపేటలో పేలిపోయిన విద్యుత్ కేంద్రాన్ని గురువారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ కలెక్టర్ పాటిల్, విద్యుత్, అగ్నిమాపక అధికారులతో కలిసి పరిశీలిం చారు. గృహ వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా విద్యుత్ సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ దురదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. గృహ వినియోగదారులు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. గురువా రం ఉదయం నుంచి వ్యవసాయ బావులకు కరెంట్ సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్ ప్రమాదానికి గల కారణాలను, నష్టాన్ని అం చనా వేస్తున్నామని చెప్పారు.
బుధవారం రోజంతా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మాజీమంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కార్యక్రమాలు పూర్తికాగానే హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడకి చేరుకున్నారో లేదో..ఇంతలోనే సిద్దిపేట 220/132కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి మం టలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయనే సమాచారం అందకున్నారు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు తిరుగు ప్రయాణమయ్యారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సమాచారం ఇచ్చి ఆయనను తీసుకొని వచ్చారు. హైదరాబాద్ నుంచి కారులో వస్తూనే పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్లో సమీక్షిస్తూ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఉపముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి బట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ కార్యదర్శి రజ్వీ, ట్రాన్స్‌కో డైరెక్టర్ జగత్‌రెడ్డిలతో మాట్లాడి సమస్యను వివరించారు. సిద్దిపేట విద్యుత్కేంద్రానికి చేరుకొని ఫైర్‌ఇంజిన్లతో మంటలు ఆర్పించారు. మున్సిపాలిటీలోని వాటర్ ట్యాంకర్లు తెప్పించారు. అధికారులకు గైడ్ చేశారు. రాత్రి 6.58 గంటలకు ప్రమాదం జరగ్గా రాత్రి 10 గంటల సమయంలో మంటలు ఆరిపోయాయి. దీంతో అందరిలోనూ టెన్షన్ తగ్గింది. రాత్రి 10.45 గంటలకు విద్యుత్‌ను పునరుద్ధరించారు. విద్యుత్‌ను పునరుద్ధరించినా మళ్లీ ఎలాంటి ఇబ్బంది రాకుండా నాలుగు ఫైర్ ఇంజన్లు అక్కడే పెట్టించారు. రాత్రి 11.30 గంటల తర్వాత అక్కడి నుంచి హరీశ్‌రావు, ప్రభాకర్‌రెడ్డి వెళ్లిపోయారు. ప్రజల కోసం హుటాహుటిన సిద్దిపేటకు చేరుకొని సమస్యను పరిష్కరించిన నాయకుడు హరీశ్‌రావు. మా నాయకుడు అంటే ఇలా ఉం టారు… అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆయన చొరవ తీసుకోకుంటే రెండు రోజులైనా కరెంట్ వచ్చేది కాదేమో అని ప్రజలు ముచ్చటించుకోవడం కొసమెరుపు.