మెదక్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించాలని జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు (ఎలక్ట్రోరల్ అబ్జర్వర్), రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్.చోంగ్తు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని రెడ్డిపల్లి ఉన్నత పాఠశాల, మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని దాయర పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం మెదక్ కలెక్టరేట్లోని అడిటోరియంలో ఎస్ఎస్ఆర్-2 స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, జెండర్ రేషియో, పీడబ్ల్యూడీ ఓటర్ నమోదుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, బీఎల్వోలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రోరల్ పరిశీలకులు డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఓటర్ నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు అన్ని వెంటనే ఆన్లైన్ చేయాలన్నారు. జాబితా రూపకల్పనలో అన్ని రాజకీయ పార్టీల నేతల సహకారం తీసుకొని తప్పులు లేని జాబితా రూపొందించాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ఇప్పటివరకు ప్రత్యేక శిబిరాలు ద్వారా నూతన ఓటరు నమోదుకు ఫారం 6 ద్వారా వచ్చిన దరఖాస్తులు, సవరణల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే జాబితాలో ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు ఐఎన్‌సీ ఎండీ నయీం, బీఆర్ఎస్ నేత ఎండీ గౌస్ ఖురేషీ. టీడీపీ నేత ఎండీ అఫ్జల్, సీపీఐ (ఎం) నేత ఎ.మల్లేశం, బీజేపీ నేత గడ్డం శ్రీనివాస్, ఏఐఎంఐఎం నేత ఇస్రత్ ఆలీ, సీపీఐ ఖలీక్ నేత తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో..
నర్సాపూర్, సెప్టెంబర్ 19 : మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎలక్ట్రోల్ అబ్జర్వర్ డాక్టర్. క్రిస్టినా జెడ్ చోంగ్తు, కలెక్టర్ రాజర్షిషాతో కలిసి సందర్శించారు. ఓటర్ నమోదు ప్రక్రియ ఎలా కొనగాగుతుందో వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓటర్ జాబితాను పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ కమలాద్రి, అధికారులు ఉన్నారు.