మెదక్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యంలో ఎన్నికల పాత్ర చాలా గొప్పదని, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ, వీవీటీ టీమ్‌లు కలిసి పనిచేయాలని వ్యయ పరిశీలకుడు సంజయ్‌కుమార్ (ఐఆర్ఎస్) అన్నారు. ఎన్నికల నియమావళిలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కేంద్ర ఎన్నిక సంఘం నియమించిన వ్యయ పరిశీలకుడు సంజయ్ కుమార్ ఐఆర్ఎస్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషాతో కలిసి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యయ పరిశీలకుడు సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా గొప్పవన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరారు. వివిధ టీమ్‌ల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మెదక్ నియోజకవర్గంలో 6 టీమ్‌లు, నర్సాపూర్ నియోజకవర్గంలో 6టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అనుమతితోనే ప్రచార సామగ్రి రవాణా చేయాలని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్తగా జీరో అకౌంట్ ఓపెన్ చేయాలని సూచించారు. అధికారులు ఏదైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. అభ్యర్థి ఎలాంటి ఖర్చు అయినా నమోదు చేయాలని, ప్రతి సంఘటనను వీడియో, కెమెరాలో రికార్డ్ చేయాలని తెలిపారు. సీజ్ చేసే ప్రతి వస్తువు సరైనదా లేదా అని సరిచూసుకోవాలని, సీజ్ అయినా వస్తువులను ఈసీఐ ధరలతో సరి చూడాలన్నారు. ఓటర్‌కు ఎలాంటి సమస్య రాకుండా చూడాలని, అధికారులు ఓటర్లతో ఎలాంటి వాదనలు చేయాకుడదన్నారు. వివిధ రకాల టీమ్‌లు అన్ని రోజు ప్రజా సమావేశాలను గమనించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్, ఎన్నికల సిబ్బంది, వీఎస్టీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్నికల నియమావళిలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ మీడియా సెంటర్‌ను జిల్లా వ్యయ పరిశీలకుడు సంజయ్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు. జిల్లాలో చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల రికార్డింగ్ పని తీరును పరిశీలించారు. సీ-విజిల్లో వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిషారాలు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీమ్‌ల పనితీరు, మీడియాలో వచ్చే వార్తలు, పెయిడ్ న్యూస్, పత్రికా ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియా రికార్డింగ్ పని తీరును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా వివరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరంలో గ్రీవెన్స్ నోడల్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, ఎల్డీఎం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని బ్యాంకు ఖాతాల సమాచారం, ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు జమైన వారి అకౌంట్ సమాచారం, వాటి వివరాలు, జీఎస్టీ అకౌంట్ల వివరాలు, ఇప్పటి వరకు సీజ్ అయిన డబ్బు, మద్యం, నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మెదక్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2007 బ్యాచ్‌కు చెందిన సంజయ్‌కుమార్ ఐఆర్‌ఎస్‌ను 34-మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం, 37-నర్సాపూర్ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకుడిగా నియమించారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. వ్యయ పరిశీలకుల పర్యటన ఈ నెల 3 నుంచి 5 వరకు, ఆ తర్వాత 9 నుంచి 15వ తేదీ వరకు, రెండో పర్యటన ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉంటుందన్నారు. వ్యయ పరిశీలకుడికి ఆర్అండ్బీ అతిథి గృహంలో బస ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి వ్యయ సంబంధిత విషయాలపై ఏదైనా ఫిర్యాదులు ఉంటే రోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సంజయ్‌కుమార్‌ను కలవచ్చని తెలిపారు. లేదా 9177030321 నంబర్లో సంప్రదించాలని సూచించారు. వ్యయ పరిశీలకుడికి జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ కృష్ణమూర్తిని లైజన్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు.