సంగారెడ్డి డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలో 207 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కల్హేర్, కంగ్టి,మనూరు, నాగల్గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట, సిర్గాపూర్, న్యాల్కల్ మండలాల్లో మొత్తం 234 పంచాయతీలు ఉండగా 27 పంచాయతీలు, 422 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 207 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 1537 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
207 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 592 మంది, వార్డు స్థానాలకు 1537 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కల్హేర్ మండలంలోని 14 పంచాయతీల బరిలో 48 మంది సర్పంచ్ అభ్యర్థులు, కంగ్టి మండలంలో 31 పంచాయతీల్లో 77, మనూరు మండలంలోని 22 పంచాయతీలకు 61, నాగ్గిద్ద మండలంలో 29 పంచాయతీలకు 81 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నారాయణఖేడ్ మండలంలోని 40 పంచాయతీలకు 125 మంది సర్పంచ్ అభ్యర్థులు, నిజాంపేటలో 15 పంచాయతీలకు 43, సిర్గాపూర్‌లో 21 పంచాయతీలకు 59 మంది, న్యాల్కల్లో 35 పంచాయతీలకు 98 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
1769 పోలింగ్ కేంద్రాలు
తుది విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న 207 పంచాయతీల్లో పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 207 పంచాయతీల్లో మొత్తం 1769 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి వరకు 1769 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి, సిబ్బంది చేరుకున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 2477 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 2762 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సున్నితమైన 351 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
తుది విడత పంచాయతీ ఎన్నికల్లో 2,25,483 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,13,019 మంది పురుషులు, 1,12,456 మంది మహిళలు, ఎనిమిది మంది ఇతరులు ఉన్నారు. బుధవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు వచ్చిన వెంటనే ఎన్నికల అధికారులు వెల్లడిస్తారు. పంచాయతీ ఎన్నికల జరిగే పంచాయతీ కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. తుది విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను మంగళవారం సమీక్షించి డీఎస్పీ,సీఐలకు పలు ఆదేశాలు జారీ చేశారు. 1200 మందికిపైగా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.
ఓటర్లకు ప్రలోభం
గత రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవటంతో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తుది విడత ఎన్నికల్లో అత్యధిక పంచాయతీలను దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ, సర్పంచ్ అభ్యర్థులపై వ్యతిరేకత ఉంది. పల్లె ఓటర్లు బీఆర్ఎస్ అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతుండంతో కాంగ్రెస్ నాయకత్వం ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం మొదలు పెట్టింది. మంగళవారం సాయంత్రం నుంచి కాంగ్రెస్ మద్దతు ఉన్న సర్పంచ్‌లు ఓటర్లకు మద్యం, డబ్బులు పంపిణీ చేసి తమవైపు తిప్పుకునే కుట్రలకు తెరలేపారు. బీఆర్ఎస్ మద్దతు ఉన్న సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను కలిసి కాంగ్రెస్ వైఫల్యాలు తెలియజెప్పి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.