పాపన్నపేట, ఫిబ్రవరి 18: తెలంగాణలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఏడుపాయల వనదుర్గాభవానీమాత జాతర శనివారం అంగరంగ వైభవంగ ప్రారంభమైంది. కార్యక్రమాన్ని మంత్రిహరీశ్‌రావు , మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలతో కలసి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, ఆలయ ఈవో సార శ్రీనివాస్, ధర్మకర్తలు, సిబ్బంది ఆలయ పండితులు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ రాజర్షిషాకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసిన మంత్రి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయలకు ప్రతియేటా నిధులు కేటాయిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఈ సంవత్సరం రూ. రెండు కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. యాదాద్రిని అధ్భుతంగా తీర్చిదిద్దామని, కొండగట్టుకు రూ. 1000కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను తెలంగాణ సర్కార్ అభివృద్ధి చేస్తున్నదని వెల్లడించారు. ప్రభుత్వ బడ్జెట్లో దేవాదాయశాఖ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వేద, పండితులు, బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా కృషి చేస్తున్నదన్నారు. హిందూధర్మ పరిరక్షణకోసం ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదని అన్నారు. రాబోయే రోజుల్లో ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. ఆయన వెంట మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జడ్పీటీసీలు ఎంపీపీలు ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అద్భుతంగా ఆలయ అలంకరణ
వనదుర్గాభవానీమాత ఆలయాన్ని అద్భుతంగా ముస్తాబు చేశారు. రకరకాల పువ్వులతో ఆలయ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. అమ్మవారి గర్భగుడితో పాటు, అమ్మవారి మండపం, ధ్వజస్తంభం, అమ్మవారి ఆలయానికి వెళ్లే వీఐపీ దారి వెంట ఉన్న జాలీలను రంగురంగు పూలతో అలంకరించారు. ఈ దృశ్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
బంగారు కిరీటం, నగలతో అమ్మవారి అలంకరణ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వనదుర్గాభవానీమాత అమ్మవారిని బంగారు కిరీటం, బంగారు నగలతో అలంకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో అమ్మవారు భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తున్నారు.
శివుడి ఉత్సవ విగ్రహం
ఆలయం ఎదుట మంజీరా నదిలో శివుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ శివుడి ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు. ఇందులోభాగంగా మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి తదితరులు ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకున్నారు.
జాతర సాగిందిలా…
మొక్కులు తీర్చే మాయమ్మా…. ఏడుపాయల దుర్గమ్మా…. సల్లంగ చూడే మాయమ్మా అంటూ భక్తులు వేనోళ్లు మొక్కుతుండగా ఏడుపాయల వనదుర్గాభవానీ జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే జాతరకు శుక్రవారం రాత్రి నుంచే భక్తుల రాక మొదలు కాగా, శనివారం వేకువజామున మంజీరా నదిలో స్నానం చేసి వనదుర్గాభవానిమాత సన్నిధిలో ఉపవాస దీక్షలు చేపట్టారు. శనివారం రాత్రంతా జాగారం చేసి అమ్మవారిని మొక్కుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ డిపోల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రతి పది నిమిషాలకో బస్సు చొప్పున సుమారు 150 బస్సులను నడుపుతున్నారు.
పటిష్ట పోలీసు బందోబస్తు
ఏడుపాయలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలి వస్తుండగా మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిప్రియదర్శిని పర్యవేక్షణలో మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సుమారు 850 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. పెద్దఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అనుక్షణం జాతరను పరిశీలిస్తున్నారు. నదీపాయల్లో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లు ఎప్పటికప్పుడు పహారా కాస్తున్నారు. ఇటీవలే సింగూరు ప్రాజెక్టు నీళ్లు ఘనపూర్ ఆనకట్టకు చేరుకోవడంతో భక్తుల స్నానాలకు ఇబ్బందులు తప్పాయి.