కొండాపూర్, మే 15: పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి దొరుకుంతుదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లి, అలియాబాద్ గ్రామాల శివారులో కేజేఎస్ యూనిట్- 2 పరిశ్రమ ఏర్పాటుకు శుక్రవారం మంత్రి దామోదరార రాజనర్సింహా, టీజీఐఐసీ చైర్పర్సన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డిలతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమలకు పెట్టుబడుల కేంద్రంగా పటాన్చెరు ముందున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే పరిశ్రమల కారిడార్‌గా ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుత సంగారెడ్డి జిల్లా ఉందన్నారు.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇక్రిశాట్, బీడీఎల్, బీహెచ్ఈఎల్ లాంటి పరిశ్రమలు ఇక్కడ స్థాపించినట్లు గుర్తుచేశారు. కొండాపూర్ మండ లం సంగారెడ్డికి అతి దగ్గరలో ఉండడంతో రూ. 650 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు కేజేఎస్ ఇండస్ట్రీ ముందు కు వచ్చిందన్నారు. మొదటి యునిట్ పటాన్‌చెరులోని పాశమైలారంలో ఉందని, రెండోది కొండాపూర్‌లోని తొగర్‌పల్లిలో ఏర్పాటు చేస్తునట్లు తెలిసారు. ఈ కంపెనీలో 1500 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుతాయని తెలిపారు. మహిళలకే 1000 ఉద్యోగాలు ఇవ్వనునట్లు మంత్రి వెల్లడించారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అందోల్ ప్రాంతంలోనూ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి చ చూపాలని మంత్రి శ్రీధర్‌బాబుకు మంత్రి దామోదర రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు.
మెదక్ ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ.. నర్సాపూర్, అందోల్, తూప్రాన్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట ఏరియాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. కాగా, ఈ కార్యమ్రంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో తనను సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఓడించినందుకు తనకు మంచే జరిగిందన్నారు. తాను ఓటమి చెందడంతో సతీమణి తూర్పు నిర్మలకు టీజీఐఐసీ చైర్పర్సన్ పదవి దక్కిందన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రతిక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అలవేణి నర్సింహారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ వై.ప్రభు, సొసైటీ మాజీ చైర్మన్లు శ్రీకాంత్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, సర్పంచ్‌లు దివ్యవాణి, లక్ష్మీ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.