తొగుట, జనవరి 18: మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్దంటూ ఆరోజు అడ్డుకున్న నేతల చేతులే నేడు గోదావరి జలాలకు హారతులు పడుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ పంపుహౌస్ వద్ద ప్రధాన కాలువకు శనివారం మంత్రి కొండా సురేఖతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. అనంతరం కాలువలో గోదారమ్మకు పూలు చల్లి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి తలపెడితే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని, అడుగడుగునా అవాంతరాలు సృష్టించారని గుర్తుచేశారు.
అన్ని అడ్డంకులను అధిగమించి కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి దుబ్బాక వంటి దుర్భిక ప్రాంతానికి సాగు,తాగునీటిని అందించారని తెలిపారు. కేసీఆర్, హరీశ్‌రావుకు దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు, రైతుల రుణపడి ఉంటారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలి పోయిందన్న కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ విడుదల చేసిన గోదావరి జలాలు కాళేశ్వరం నుంచి వచ్చినవి కావా అని ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గంలో కాలువలు నిర్మించాలని ఏడాదిగా ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే కాలువలు పూర్తి చేయాలని కోరారు.
కూడవెల్లి వాగుతో పాటు రామాయంపేట, చిన్నశంకరంపేట కాలువలకు నీళ్లు విడుదల చేయాలన్నారు. పాత పనులకే కొత్త పూత అన్నట్లు గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన పనులకే నేడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నట్లు తెలిపారు. మల్లన్నసాగర్ కాలువ ద్వారా తొగుట దుబ్బాక, సిద్దిపేట, నంగునూరు, నారాయణరావుపేట, ముస్తాబాద్ మండలాల్లోని 80 వరకు చెరువులు, కుంటలను నింపి సాగునీరు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ,కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, నాయకులు మనోహరరావు, జీడిపల్లి రాంరెడ్డి, హరికృష్ణరెడ్డి, బాసిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, దోమల కొమురయ్య, చిలువేరి మల్లారెడ్డి, బక్క కనకయ్య, కొమురయ్య, ఎండీ ఖలీమొద్దీన్, గోవర్ధన్‌రెడ్డి, రమేశ్, నాయకులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.