దుబ్బాక, జూన్ 15: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుదామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మన ప్రాంతాభివృద్ధి కోసం రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. శనివారం దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పీఆర్ సంబంధించిన రోడ్లు, భవనాల నిర్మాణ పనులతోపాటు పెండింగ్‌లో ఉన్న పనుల గురించి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో నూతనంగా పలు రోడ్లతోపాటు మరికొన్ని రోడ్ల మరమ్మతుల కోసం నిధులకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గంలో 47 రోడ్లకు రూ.104 కోట్లు మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఇందులోభాగంగా ఒక్కో శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల ఆర్అండ్బీ, వైద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు. ఆర్అండ్బీ శాఖ ద్వారా నియోజకవర్గంలో పలు రహదారులకు రూ. 200 కోట్లు అవసరమని తెలిపారు.
నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులకు కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వానికి నివేదించి, మంజూరు కోసం కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలకూ సరైన రహదారులు నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు నిధులు కేటాయించాలని కోరారు. సమీక్షలో పీఆర్ ఎస్ఈ జోగారెడ్డి, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, చిరంజీవి, డీఈ విజయప్రకాశ్, ఏఈలు శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, రిజ్వాన్, రామ్‌కుమార్, దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీలు రవీందర్‌రెడ్డి, సూకూరి లక్ష్మీలింగం, బీఆర్ఎస్ నాయకులు పోలబోయిన నారాగౌడ్, రణం శ్రీనివాస్, తౌడ శ్రీనివాస్, చింతల కృష్ణ, పంజాల శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.