దుబ్బాక, జూన్ 6 : మున్సిపాలిటీల్లో స్వచ్ఛతను మెరుగుపరచడంతో పాటు సేకరించిన వ్యర్థాలతో సంపద సృష్టించేందుకు ప్రభుత్వం డంపు యార్డుల్లో (డ్రై రిసోర్సు కలెక్షన్ సెంటర్ (డీఆర్సీసీ)ఏర్పాటు చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కోట్ల రూపాయలతో నిర్మించిన డంపుయార్డు నిరూపయోగంగా మారింది. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంతో దుబ్బాకలో డీఆర్సీసీ వినియోగంలో లేక అధ్వానంగా మారింది. పట్టణంలో సేకరించిన చెత్తను తడి,పొడి వేర్వేరుగా చేసి, వాటితో సంపద సృష్టించేందుకు ఏర్పాటు చేసిన డీఆర్సీసీ కేంద్రం లక్ష్యం నెరవేరడం లేదు.
దుబ్బాక పట్టణంలో నిర్మించిన డంపుయార్డు నిర్వహణ లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారింది. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట-లచ్చపేట శివారులో 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో డంపుయార్డు నిర్మాణం చేపట్టారు. అందులోనే రూ.1.30 కోట్లతో డ్రై రిసోర్సు కలెక్షన్ సెంటర్(డీఆర్సీసీ), వర్మీ కంపోస్టు , వే బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. చెత్తతో సంపద సృష్టించడమే డీఆర్సీసీ కేంద్రాల ప్రధాన లక్ష్యం కాగా, దుబ్బాకలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో డీఆర్సీసీ కేంద్రం వినియోగంలోకి తీసుకురావడం లేదు.
పట్టణంలో మున్సిపల్ వాహనాల్లో సేకరించిన తడి,పొడి చెత్తను డంపుయార్డులో డీఆర్సీసీలో రీసైక్లింగ్ చేయడం ద్వారా ఆదాయం సమకూరుతుంది. తడి, పొడి చెత్తను వేరు చేసి, వాటిని రీ సైక్లింగ్ చేయడంతో వర్మీ కంపోస్టు, ఇతర అవసరాలకు వినియోగిస్తారు. దీని ద్వారా మున్సిపల్‌కు ఆదాయం సమకూరుతుంది. డీఆర్సీసీ కేంద్రంలో కేవలం పొడి చెత్తను రీసైక్లింగ్ చేసే యంత్రాలను బిగించి వదిలేశారు. విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేపోయింది. నిరూపయోగంగా వదిలేయండతో యంత్రాలు తుప్పు పడుతున్నాయి. ఇకపోతే వర్మీ కంపోస్టు కేంద్రంలో సేంద్రియ ఎరువుల తయారీకి సంబంధించిన యంత్రాలు అతీగతి లేదు. సిబ్బంది లేకపోవడంతో సేకరించిన చెత్తను రీసైక్లింగ్ చేయడం లేదు.
దుబ్బాక బల్దియా పరిధిలో నిత్యం 14 టన్నుల వరకు చెత్త పోగవుతున్నది. మున్సిపల్ వాహనాల ద్వారా చెత్తను పారిశుధ్య సిబ్బంది సేకరించి, డంపు యార్డుకు తరలిస్తున్నారు. డీఆర్సీసీ కేంద్రం వినియోగంలో లేకపోవడంతో సేకరించిన చెత్తను యార్డులోనే తగలబెడుతున్నారు. దీంతో డంపుయార్డు ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుని వాయు కాలుష్యం చోటుచేసుకుంటున్నది. చెత్తను రీసైక్లింగ్ చేయకుండా, వాటిని కుప్పలుగా చేసి తగలబెట్టడంతో మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతున్నది.
పొడి చెత్తను రీసైక్లింగ్ చేసే డీఆర్సీసీ కేంద్రానికి విద్యుత్తు నియంత్రిక మంజూరు కాలేదు. దీంతో కరెంట్ సరఫరా లేకపోవడంతో వేబ్రిడ్జి వృథాగా మారింది. మరోపక్క బిగించిన యంత్రాలకు దుమ్ముతో పాటు తుప్పు పట్టిపోతున్నాయి. తడి,పొడి చెత్త సేకరణ కాగితాలకే పరిమితమైంది. డంపుయార్డులో బిగించిన యంత్రాలు అలంకారప్రాయంగా మారాయి. డీఆర్సీసీలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు మూడు నెలల కిందట ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కరెంట్ సరఫరా లేకపోవడంతో కాంట్రాక్టర్‌కు సమస్యగా మారిం ది. డీఆర్సీసీ కేంద్రా న్ని వినియోగంలోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
దుబ్బాక డీఆర్సీసీ కాంటాక్టు తీసుకుని 3 నెలలు గడిచింది. కరెంట్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో సమస్య నెలకొంది. కరెంట్ కనెక్షన్ కోసం కమిషనర్‌కు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదు. పొడి చెత్తా వ్యర్థాలు కుప్పలుగా నిండిపోయాయి. డీఆర్సీసీ కేంద్రానికి కరెంట్ సరఫరా ఇస్తే వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకునేవాళ్లం. కరెంట్ సరఫరా లేకపోవడంతోనే సమస్యగా మారింది. కరెంట్ కనెక్షన్ ఇవ్వకపోతే మేము తప్పుకుంటాం.
– అనిత, డీఆర్సీసీ కాంట్రాక్టర్
డంపు యార్డులో చెత్తను కాల్చకుండా చర్యలు తీసుకుంటాం. అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి, సమస్య పరిష్కరిస్తాం. అందులో విద్యుత్ కనెక్షన్ అందించి డీఆర్సీసీతో పాటు వర్మీ కంపోస్టు కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తాం. కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేశాం. అతి త్వరలోనే వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తాం.
-రమేశ్, దుబ్బాక మున్సిపల్ కమిషనర్