నారాయణఖేడ్, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య పాలనలో నీటి కోసం కిలోమీటర్ల కొలది నడిచి వెళ్లడం, ఎడ్లబండ్లు, బైక్‌లపై ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి నీటిని తరలించడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం, ఉన్న ఒక్క బోరుమోటారు వద్ద గుంపులుగా చేరి నీళ్లు పట్టుకోవడం, రెండు తండాల మధ్య ఉన్న ఒక బోరు కోసం రెండు తండాల ప్రజలు ఘర్షణకు దిగిన దృశ్యాలు సర్వసాధారణంగా కనిపించిచేవి.
బిందెడు నీళ్ల కోసం గిరిజనులు ప్రమాదకరమైన లోతైన బావుల్లో నుంచి నీటిని తోడుకుంటున్న చిత్రాలు ఆనాడు పతాక శీర్షికలయ్యాయి. వీటన్నింటికి చరమగీతం పాడు తూ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించింది మిషన్ భగీరథ పథకం. నారాయణఖేడ్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్య దృష్ట్యా మిషన్ భగీరథ పథకాన్ని యుద్ధప్రాతిపదికన కేసీఆర్ పూర్తిచేయించారు. ఫలితంగా పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో తాగునీటి సమ స్య వందశాతం పరిష్కారం అయ్యిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
దశాబ్దాలుగా మంచినీటి కష్టాలను ఎదుర్కొన్న నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలను మిషన్ భగీరథ పథకం వరప్రదాయినిలా మారి ఆదుకున్నది అనడంలో ఎలాం టి అతిశయోక్తి లేదు. మారుమూల తండాల్లోనూ ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని సరఫరా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. మిషన్ భగీరథ పథకం సమర్థవంతంగా కొనసాగించడంతో ఎప్పుడూ నీటి సమస్య ఉత్పన్నం కాలేదు. ఏ ఒక్కరోజూ నీటికోసం ప్రజలు పరుగులు పెట్టిన దృశ్యాలు కనిపించలేదు.
అందుకు భిన్నంగా ప్రస్తు తం కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి నీటి సమస్య నెలకొంది. ఎండాకాలం ఆరంభంలోనే మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ నిర్వహణను సరిగ్గా పట్టించుకోక పోవడంతో నీటి సమస్యలు నెలకొన్నాయి. గ్రామాలు, తండాలకు రోజుల తరబడి నీరు సరఫరా కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే ‘ఆనాటి రోజులు’ మళ్లీ వచ్చాయనే ఆందోళన ప్రజల్లో కనిపిస్తున్నది.
తడారుతున్న గిరిజనుల గొంతులు
ఈ వేసవిలో తండాల గొంతులు తడారుతున్నా యి. నీటి కోసం కిలోమీటర్లు వెళ్లాల్సిన అనివార్యత నెలకొందని గిరిజనులు వాపోతున్నారు. నారాయణఖేడ్ మండలం చాప్టా(కె) పరిధిలోని శేరితండా, అక్లయితండా, గైరాన్తండాల్లో 16 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో తండా వాసులు నాలుగైదు కిలోమీర్లు వెళ్లి వ్యవసాయ బోర్లను ఆశ్రయించి నీటిని తెచ్చుకుంటున్నారు. సమైక్య పాలనలో మాదిరిగానే ఎడ్లబండ్లు, బైక్‌లపై నీటిని తెచ్చుకుంటున్నారు. ఇం తటి దారుణ పరిస్థితి అధికారులకు తెలియనిది కాదు. తండావాసులు అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పూటగడిచేందుకు పని చేయడం ఒక వంతైతే, నీటిని సమకూర్చుకోవడం మరో వంతుగా మారింది ఈ ప్రాంత వాసులకు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మే, జూన్ నెలల్లో నీటి సమస్య మరింత తీవ్రం కానున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరంచాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారులు పట్టించుకుంట లేరు..
శేరితండా, అక్లయితండా, గైరాన్ తండాలకు రెండు వారాల సంది మిషన్ భగీరథ నీళ్లు అస్తలేవు. ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంట లేరు. నీళ్లకు చాలా కష్టమైతంది. నీళ్ల కోసం నాలుగైదు కిలోమీటర్లు అల్లాపూర్, చాప్టా(కె) దాకా పోవాల్సి వస్తున్నది. బైక్‌లు, ఎడ్ల బండ్ల మీద నీళ్లు నింపుకస్తున్నం. ఆఫీసర్లు మనసుపెట్టి మల్ల మిషన్ భగీరథ నీళ్లు వచ్చేటట్ల చెయ్యాలే. గతంల టీఆర్ఎస్ ప్రభుత్వంల ఎప్పు డు కూడా ఇన్ని రోజులు నీళ్లు బంద్ కాలేదు.
– శంకర్ నాయక్, శేరితండా