Pragnapur | గజ్వేల్, మార్చి 21: మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామంలో 3,4,15,16 వార్డులో మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కమిషనర్ గోల్కొండ నరసయ్యకు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గత కొద్ది రోజులుగా మిషన్ భగీరథ ద్వారా సరిపడా మంచినీళ్లు ఇంటింటికి రావడం లేదని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మంచినీటి తీవ్రత ఏర్పడిందని అందుకు అధికారులు గ్రామస్తుల సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు సరిపడా మిషన్ భగీరథ మంచినీళ్లు వచ్చే విధంగా చూడాలని కోరారు.
అసలే ఎండాకాలం మంచినీళ్లు సరిపడా రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. రాబోయే రోజుల్లో మరింత ఎండలు తీవ్రతరం అయితే మంచినీటి సమస్య ఎక్కువ అవుతుందని అందుకు ముందుగానే సమస్యను పరిష్కరించాలని కోరారు. మంచినీటి సమస్య పరిష్కరించలేని పక్షంలో గ్రామస్తులు తీవ్ర నిరసనలు, ఆందోళనలు చేపట్టి అవకాశాలున్నాయని అందుకు ముందుగానే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామన్నారు. కార్యక్రమంలో మార్కంటి కనకయ్య, కనకరాజు, మన్నె వెంకటేష్, బిక్షపతి, సాయిబాబా, మహేందర్ రెడ్డి, ఎల్లా శ్రీనివాస్, విఠల్, తుమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.