మెదక్,మే 4(నమస్తే తెలంగాణ) : గుక్కెడు నీళ్ల కోసం మెదక్ జిల్లా ప్రజలకు పుట్టెడు కష్టా లు తప్పడం లేదు. మెదక్ జిల్లాలోని గ్రామ పంచాయతీలు, తండాల్లో తాగునీటి సమ స్య తీవంగా ఉంది. మిషన్ భగీరథ నీరు అరకొరగా సరఫరా అవుతుండడంతో జనం గొం తెండుతున్నది. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోవడం, మోటర్లు మొరాయిస్తుండడంతో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నది. తాగునీరు ఇవ్వాలని ఇప్పటికే పలు గ్రామా ల్లో పంచాయతీలను ప్రజలు ముట్టడించారు. తాగునీటి కోసం మహిళ లు బిందెలతో పొలాల్లోని బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు.కొద్దిరోజులుగా మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రాకపోవడంతో మహిళలు బయటకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు.
మెదక్ జిల్లాలోని నర్సాపూర్, కౌడిపల్లి, చిలిపిచెడ్, చిన్న శంకరంపేట, కొల్చారం, టేక్మాల్తో పాటు ఆయా మండలాల్లోని గిరిజన తండా లు,గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బోర్ల నుంచి అరకొర నీరు వస్తుండడంతో పంట పొలాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు.
మం డల కేంద్రమైన కొల్చారంలో మూడో వార్డులో (ఎండుగుల బస్త్తీ) సింగల్ ఫేస్ మోటార్ రిపేర్ రెండు నెలలుగా మరమ్మతులకు నోచుకోవడం లేదని స్థానిక వాసి ఎండుగుల అశోక్ వాపోయారు. కౌడిపల్లి మండల పరిధిలోని శేరి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కొర్ర తండాలో నీటి ఎద్దడితో మహిళలు పొలాల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డి గూడెం తండాతో పాటు మరో మూడు తండాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. చిలిపిచెడ్ మండలంలోని టోపి తండా, గన్న తండా,గౌతాపూర్,బద్రయ తండా లో నీటి కోసం గిరిజనులు ఇక్కట్లు పడుతున్నారు.