దుబ్బాక, ఏప్రిల్ 9: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆరెపల్లిలో తాగునీటి సమస్యతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా లేక నీటి సమస్య ఏర్పడింది. గ్రామంలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు తాగునీటి కోసం వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లారు. రైతులు వారిని తిప్పి పంపించారు. నీటి సమస్యపై మాజీ సర్పంచ్ సంతోషలక్ష్మీ కృష్ణంరాజు సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది.
దీంతో ఆయన గ్రామానికి చెందిన రైతులను బతిమిలాడి పొలాల నుంచి ట్యాంకర్ ద్వారా గ్రామస్తులకు మంగళవారం రాత్రి నీటిని సరఫరా చేశారు. వరి పంటకు సాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో బోరుబావుల వద్దకు రైతులు రానివ్వడం లేదు. పొలాల వద్ద సింగిల్ ఫేస్ మోటరు ద్వారా ట్యాంకర్ను నింపేందుకు అర్ధరాత్రి వరకు సమయం పడుతున్నందున, ఆ సమయంలో గ్రామస్తులు నిద్రాహారాలు మాని తాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు.