సంగారెడ్డి, మే 3(నమస్తే తెలంగాణ): ఓవైపు వేసవి ఎండలు.. మరోవైపు తాగునీటి సమస్యతో సంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజు నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పలు గ్రామాలు, తండాలకు రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుండడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా వ్యవస్థ సరిగ్గా పనిచేయక పోవడమే కాకుండా మంజీరా నదిలో నీళ్లు తగ్గుతుండడం నీటి సమస్యకు మరో కారణం. జిల్లాలో భూగర్భ జల మట్టాలు సైతం వేగంగా పడిపోతున్నాయి. తాగునీటి కోసం తవ్వించిన బోరుబావులు కొన్నిచోట్ల ఎండిపోతుండగా, మరికొన్ని చోట్ల తక్కువగా నీళ్లు పోస్తున్నాయి.
సింగూరు ప్రాజెక్టు నుంచి జిల్లాలోని 28 మండలాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టు మరమ్మతుల దృష్ట్యా సింగూరు ప్రాజెక్టు ఖాళీ చేసి, కేవలం 7టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచారు. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గడంతో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేయడంపై ప్రభావం చూపుతున్నది. ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉండడంతో మంజీరా నదికి ఇరువైపులా ఏర్పాటు చేసిన ఇంటెక్‌వెల్‌ల వద్ద నీటిమట్టం తగ్గి నీటిని పంపింగ్ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో మిషన్ భగీరథ ద్వారా నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, నియోజకవర్గాలలోని పలు గ్రామాలకు రోజు తప్పించి రోజు లేదా రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతున్నది.
సంగారెడ్డి జిల్లాలో భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోవడం తాగునీటి సమస్యకు దారితీస్తున్నది. మార్చిలో భూగర్భ జల మట్టాలు జిల్లాలో 10.60 మీటర్లు ఉండగా, ఏప్రిల్‌లో 11. 90 మీటర్లకు పడిపోయాయి. సదాశివపేట మండలంలో అత్యధికంగా మూడు మీటర్ల మేర భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. కంగ్టి, కల్హేర్, నిజాంపేట, హత్నూర, పటాన్చెరు, గుమ్మడిదల మండలాల్లో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. దీంతో బోరుబావుల ద్వారా నీటి సరఫరా చేస్తున్న గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

నారాయఖేడ్‌లో తీవ్రమవుతున్న తాగునీటి సమస్య
సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నది. ఇటీవల సిర్గాపూర్ మండలం జీవుల తండాలో తాగునీటి కోసం ప్రజలు ధర్నా చేశారు. సిర్గాపూర్ మండలంలోని పలు గ్రామాలకు రోజు తప్పించి రోజు తాగునీరు సరఫరా అవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ ఇంటెక్‌వెల్‌ల వద్ద నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో తాగునీటి సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. నాగలిగిద్ద మండలంలోని శాంతినగర్ తండా, రత్నానాయక్ తండా, ఇరక్‌పల్లిలో తాగునీటి సమస్య ఉంది. మనూరు మండలంలోని ఎన్జీ హుక్రానా, అతిమ్యాల, తోర్నాల్ గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కంగ్టి మండలం దెగుల్‌వాడి, కంగ్టి, చౌకన్పల్లి, బోర్గి, జీద్గి తండాలో రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిన్నారం మండలంలోని ఖాజీపల్లి, గడ్డపోతారం, జిన్నారం గ్రామాల్లో మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమీన్పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేట, సల్తాన్పూర్, దాయారా గ్రామాలతో పాటు భరత్‌నగర్, ఎస్ఎస్ హోమ్స్, దర్బార్ హోమ్స్ తదితర కాలనీలో తాగునీటి సమస్య ఉన్నది. కాలనీవాసులు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, తేజ కాలనీ, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ పట్టణంలో పలు వార్డులో తాగునీటి సమస్య నెలకొన్నది.
నీటి సమస్యతో ప్రజల తిప్పలు
కంగ్టి, మే 3: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఆయా గ్రామాల్లో మిష న్ భగీరథ నీళ్లు అంతంత మాత్రంగానే సరఫరా కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇంటింటికీ తాగునీరందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటికీ తాగునీని అందించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ నీటి కష్టాలు షురు అయ్యాయి. దీంతో ప్రజలు ప్రైవేట్ బోర్లపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. కంగ్టి, దెగుల్‌వాడి, బోర్గి, చౌకన్పల్లి, భీంరా, తుర్కవడగామ, జీర్గితండా, రాజారాం తండా, నాగూర్(కె), నాగూర్(బీ), జమ్గి తదితర గ్రామాల్లో తీవ్రమైన నీటి సమస్య నెలకొంది. గ్రామంలో ట్యాంకర్ నీళ్లు సరిపోవడం లేదని, అధికారులు స్పందించి ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇంద్రేశంలో తాగునీటికి కటకట
పటాన్చెరు టౌన్, మే 3: సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తుండడంతో పలు కాలనీల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఇండ్లబయట డ్రమ్ములు, నీటి ట్యాంకులు ఏర్పాటు చేసుకుని ట్యాం కర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేసి నింపుకొంటున్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, సాయిశ్రీనివాస కాలనీ, తేజ కాలనీల్లో నీటిఎద్దడి తీవ్రంగా ఉంది. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని తాగునీటి సరఫరా చేయాలని ఆయా కాలనీలవాసులు కోరుతున్నారు.