జిన్నారం, మే 16: పంట పండించడం కంటే అమ్ముకోవడానికి రైతు ఎకువ కష్టపడాల్సి వస్తోంది. ఆరు కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అష్టకష్టాలు పడి విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో అంతా దగా నడుస్తోందని, నిర్వాహకులు మోసం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి ఆదేశాల మేరకు శుక్రవారం డీఆర్డీవో పీడీ జ్యోతి మండలకేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసి ముద్దయి ఆరబెట్టిన ధాన్యాన్ని మాయిశ్చర్ మిషన్‌తో పరిశీలించి రైతుల గోడు తెలుసుకున్నారు. సకాలంలో కాంట వేయడం లేదని, టోకెన్ల ప్రకారం కొనుగోలు చేపట్టడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకంలో మోసాలు జరుగుతున్నాయంటూ విన్నవించారు.
తూకంలో క్వింటాల్‌కు ఏడు కిలోల చొప్పున మోసాలకు పాల్పడుతున్నారని అధికారి వద్ద రైతులు బోరున విలపించారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, హమాలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. 15 రోజులుగా కేంద్రం వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని ఓ మహిళా రైతు పీడీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి వచ్చిన పంటను విక్రయించే వరకు ప్రతి సందర్భంలో అన్నదాత దోపిడీకి గురవుతున్నాడని రైతు నాయకుడు పుట్టి భాసర్ డీఆర్డీవో పీడీకి వివరించారు. పెట్టిన పెట్టుబడి, శారీరక శ్రమ అన్నీ వృథా అవుతున్నాయని, దేశానికి అన్నం పెట్టే రైతన్న చివరికి తినడానికి తిండి కూడా కొనుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడని వాపోయారు.
కొనుగోలు కేం ద్రంలో జరుగుతున్న మోసంపై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులతో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన డీఆర్డీవో పీడీ నిర్వాహకుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రశ్నించారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని గుర్తించి బాధ్యులైన ఏపీఎం నరేందర్, వీవోఏ లతకు షోకాజ్ నోటీసులు అం దిస్తామన్నారు. కేంద్రంలో ధాన్యాన్ని సకాలంలో తూకం వేసి మిల్లులకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. కేంద్రం వద్దకు లారీ లు పంపించాలని డీఎస్వోను కోరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ అనిల్‌కుమార్ తనిఖీ చేశారు. కేంద్రంలో జరుగుతున్న మోసాలపై ఆరా తీశారు. తూకం వేసే సమయంలో క్వింటాల్‌కు దాదాపు 4 కిలోల చొప్పున మోసాలకు పాల్పడుతున్నారని స్వయంగా తూకం వేసి నిర్ధారించారు.
రెండు తూకం యంత్రాలను సీజ్ చేశారు. రైతులను మోసాలకు గురిచేస్తున్న కేంద్రం నిర్వాహకులపై కేసు నమోదు చేసి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. ధాన్యం విక్రయాలు చేసిన రైతులకు పరిహారం అందించేలా కృషి చేస్తామన్నారు. స్పందించిన అధికారుల తీరుపై ఆయా గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఈవో అజారుద్దీన్, ఐకేపీ సిబ్బంది, రైతులు ఉన్నారు.