రాయపోల్, జూన్ 25 : రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాయపోల్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలోని ఆయా గ్రా మాల్లో ఉన్న ఆగ్రోస్ కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అటు వర్షాలు, ఇటు ఎరువులు లేక రైతులు పడరానిపాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అమలు చేసినట్లు రైతుబంధును ఇప్పటివరకు రైతులకు అందించకపోవడంతో వారు పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను అశ్రయించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులకు మరింత భారంగా మారిందన్నారు. ప్రస్తుతం వర్షాలు లేక కాల్వల ద్వారా నీరు వస్తే రైతులు పంటలను కాపాడుకునే అవకాశం ఉందన్నారు. రైతులు సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ సర్కార్ పార్టీ ఫిరాయింపులకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, లేనిపక్షంలో రైతుల తరఫున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం రేణుకాఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ గౌడ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.