గజ్వేల్, జూలై 16: సకాలంలో సాగునీళ్లు ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామ సమీపంలోని కొండపోచమ్మ సాగర్ కాలువల వద్ద కూడవెల్ల్లి, హల్దీ వాగుల్లోకి సత్వరమే సాగునీళ్లు విడుదల చేయాలని బుధవారం ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం రైతులతో కలిసి వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కన్నెపల్లి వద్ద మోటర్లు ఆన్‌చేసి రిజర్వాయర్లు నింపాలని డిమాండ్ చేశారు. సాగునీళ్లు లేక రైతులు మొగులుకు ముఖం పెట్టి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారని, వరినార్లు ముదురుతున్నట్లు తెలిపారు. దగ్గరలోనే ప్రాజెక్టులు ఉన్నా రైతులకు చుక్క నీటిని అందించకుండా ప్రభుత్వం మొద్దునిద్ర పోతున్నదని విమర్శించారు. పంటలు ఎండిపోతుంటే రైతులు మానసిక క్షోభకు గురవుతున్నారని, దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాలువల ద్వారా సాగునీళ్లు విడుదల చేయాలని కోరారు. కూడవెల్ల్లి, హల్దీ వాగుల్లోకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగదేవ్‌పూర్ కెనాల్ ద్వారా ఆలేరు వరకు సాగునీళ్లు విడుదల చేయవచ్చని, రామాయంపేట కాలువల ద్వారా సైతం నీటిని విడుదల చేయాలన్నారు. కాలం కాకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో సాగునీటిని అందించి పంటల సాగుకు సహకరించిందని వంటేరు ప్రతాప్‌రెడ్డి గుర్తుచేశారు.
మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నుంచి కేసీఆర్ మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లా రైతులకు సాగునీళ్లు అందించి గుంట జాగ ఎండిపోకుండా కాపాడారని వంటేరు ప్రతాప్‌రెడ్డి గుర్తుచేశారు. కోటి పైచిలుకు జనాభా కలిగి హైదరాబాద్ నగరానికి నీటిభరోసా కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గోదావరి నంది నుంచి వృథాగా జలాలు సముద్రంలో కలుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను లిఫ్ట్ చేయడం లేదని విమర్శించారు. కూడవెల్లి వాగులోకి నీటిని వదిలితే మానేరు వరకు 100 కిలోమీటర్ల మేర 40చెక్‌డ్యామ్‌ల్లో సమృద్ధిగా నీళ్లు ఉంటాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు పునాదుల మీద అధికారంలోకి వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. రెండు మూడు రోజుల్లో కాలువల ద్వారా సాగునీళ్లు వదలకపోతే మాజీమంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో రాజీవ్ రహదారిని ముట్టడిస్తామని వంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిన హెచ్చరించారు. ఆందోళనలో గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు పండరి రవీందర్రావు, బొల్లారం ఎల్ల య్య, పాల రమేశ్‌గౌడ్, రాజిరెడ్డి, గొడుగు స్వామి, స్వా మిచారి, తోట శ్రీనివాస్, రాజు, అబ్దుల్ శ్రీనివాస్‌రెడ్డి, బాలచంద్రం, అహ్మద్, నిజాం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.