సంగారెడ్డి, మే 22(నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంగారెడ్డి జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తాను..నన్ను చూసి ఎమ్మెల్యేలకు ఓటువేసి గెలిపించండి. జిల్లా అభివృద్ధికి బాటలు వేయడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాను’.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్‌రెడ్డి సీఎం పగ్గాలు చేపడితే జిల్లా దశాదిశ మారుతుందని ప్రజలు నమ్మారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా జిల్లాలో అభివృద్ధి అటకెక్కింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోవడం లేదు. రేవంత్ సర్కార్ సంగారెడ్డి జిల్లాపై శీతకన్ను వేసింది. జిల్లా అభివృద్ధి నిధుల జాడలేదు. కొత్త ప్రాజెక్టులు, కొత్త పరిశ్రమలు రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలు, 600కుపైగా పంచాయతీల అభివృద్ధ్దికి ఎస్డీఎఫ్ నిధులు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఎస్డీఎఫ్ నిధులు పూర్తిగా నిలిపివేసింది. జిల్లాను సస్యశ్యామలం చేసేలా కేసీఆర్ ప్రకటించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను రేవంత్ సర్కార్ అటకెక్కించింది. జిల్లాలోని రైతులకు పూర్తిస్థాయిలో రైతుబంధు, పంట రుణమాఫీ అమలు చేయలేదు. కొత్త రేషన్‌కార్డులు, పింఛన్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నా ప్రభుత్వ పట్టించుకోవడం లేదు.
అభివృద్ధికి నిధులేవి…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి నిధులు విడుదల కాలేదు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో అభివృద్ధ్ది పనుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు, సీసీరోడ్లు, ఇతర అభివృద్ధి చేపట్టాల్సి ఉంది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలు, 600కు పైగా పంచాయతీలకు ఎస్డీఎఫ్ నిధు లు మంజూరు చేశారు.
సంగారెడ్డి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేశారు. అందోలు, జహీరాబాద్, సదాశివపేట, నారాయణఖేడ్, అమీన్పూర్, తెల్లాపూర్, ఆర్సీపురం మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పన ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని 600కుపైగా పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఎస్డీఎఫ్ నిధులు నిలిపివేసింది. ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో సమీకృత వెజ్,నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
వీటిని పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. పటాన్చెరులో కార్మికుల కోసం కేసీఆర్ సర్కార్ 250 పడకల దవాఖాన నిర్మాణం ప్రారంభించింది. 90శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా 10శాతం పనుల పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. పాశమైలారం పారిశ్రామికవాడ నుంచి కర్ధనూరు వరకు కేసీఆర్ ప్రభుత్వం రెండు వరుసల రహదారి నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వం మరికొన్ని నిధులు విడుదల చేస్తే రోడ్డు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
పటాన్‌చెరుకు కేసీఆర్ సర్కారు ఆర్డీవో కార్యాలయం, రిజిస్ట్రేషన్ కార్యాలయం మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కార్యాలయాలను ఏర్పా టు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ సర్కార్ మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రోరైలు విస్తరిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రైలు విస్తరణ పనులు పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి నియోజకవర్గం ఉర్దూ రెసిడెన్సియల్ కళాశాల, పాఠశాలల భవన నిర్మాణ పనులకు రూ.10 కోట్ల నిధులు అవసరం. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిధులు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి రూ.100 కోట్ల వరకు నిధులు అవసరం ఉంది. మెట్రోరైలును సంగారెడ్డి వరకు పొడిగించాలని, సంగారెడ్డిలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అందోలు నియోజకవర్గంలోని అల్లాదుర్గం-మెటల్‌కుంట రోడ్డు నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
జహీరాబాద్‌కు వరాలు కురిపించేనా..
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇకనైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయా అని ఎదురుచూస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.100 కోట్లకుపైగా నిధులు అవసరం ఉన్నాయి. జహీరాబాద్-బీదర్ రహదారి విస్తరణ చేపట్టాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కొత్తూరు సమీపంలోని నారింజ ప్రాజెక్టు జలాలు వృథాగా దిగువకు పోతున్నాయి. ఈ ప్రాజెక్టు జలాలు తమకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జహీరాబాద్ రైతులకు కోరుతున్నారు. కొత్తూరులోని చెరుకు పరిశ్రమ ప్రారంభమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెరుకు రైతులు డిమాండ్ చేస్తున్నారు. మీర్జాపూర్ పీజీ కళాశాలలో కొత్తకోర్సులు ప్రారంభించాలని, జహీరాబాద్ సమీపంలోని హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు.
రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వం
కాంగ్రెస్ పాలనలో సంగారెడ్డి జిల్లా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వందశాతం పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. కానీ, జిల్లాలో 30 శాతం మందికిపైగా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని 50 శాతం రైతులకు మాత్రమే రైతుభరోసా డబ్బులు జమయ్యాయి. రైతుభరోసా డబ్బులను వెంటనే తమ ఖాతాల్లో జమ చేయాలాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎరువుల కొరత, నకిలీ విత్తనాల కొరతను రైతులు ఎదుర్కొంటున్నారు.
అటకెక్కిన సంగమేశ్వర,బసవేశ్వర ఎత్తిపోతలు
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో అప్పటి సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. గోదావరి జలాలను మంజీరాలో కలిపి, ఆ నీటిని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని రైతులకు సాగునీరు అందించేందుకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కేసీఆర్‌కు క్రెడిట్ దక్కవద్దన్న కుయుక్తితో రేవంత్ సర్కార్ సంగమేశ్వర,బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేసింది. జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాల పరిధిలో ఉన్న 231 గ్రామాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా రూ.2653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పనులను కేసీఆర్ ప్రారంభించారు. చిన్నచల్మెడలలో పంప్‌హౌస్ పనులు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ఆపింది.
నారాయణఖేడ్, అందోలు నియోజవర్గాల్లో 1.71 లక్షల ఎకరాకు సాగునీరు అందించేలా కేసీఆర్ సర్కార్ రూ.1774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వడం లేదు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో సింగూరు బ్యాక్‌వాటర్ నుంచి నల్లవాగు ప్రాజెక్టుకు మంజీరా జలాలు తరలించేందుకు రూ.100కోట్లతో పథకానికి బీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదించింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు కాల్వల లైనింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనుల నాణ్యతతో వేగంగా పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు. మరమ్మతుల పేరుతో రైతులు ఇప్పటికే రెండు పంటలు సాగుచేయలేక నష్టపోయారు.