కోహెడ, ఏప్రిల్ 22: మండలంలోని శనిగరం గ్రామ మత్స్యకార సహకార సంఘంలో మంగళవారం జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మత్స్యకారుల సమస్యలు తెలుసుకున్నారు. మండలంలోని శనిగరం, గుండారెడ్డిపల్లి, చిన్నకోడూరు మండలం, చెర్లఅంకిరెడ్డిపల్లి, అనంతసాగర్ గ్రామస్తులు మత్స్య సహకార సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నారని సొసైటీ సభ్యులు తెలిపారు. రిజర్వాయర్‌లో చేపలు పట్టి నేరుగా ఇండ్లకు వెళ్లి విక్రయాలు చేపడుతున్నామని తెలిపారు. చేపల విక్రయానికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.
చేపలు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం వలలు కొనడానికి సరిపోవడం లేదని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అధునాతన తెప్పలు, చేప విత్తనం ఏప్రిల్‌లో ఇవ్వాలని, చేపలు అమ్మగా మిగిలిన చేపలను ఉంచడానికి స్టోరేజ్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ను మత్స్యకారు సభ్యులు కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మత్స్య సహకార సంఘాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి మత్స్య సహకార సొసైటీ కృషిచేస్తున్నట్లు తెలిపారు.
మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం కోసం ప్రైవేటు కంపెనీలకు అనుసంధానం చేయడం, సలహాలు, సూచనల కోసం డిగ్రీ కళాశాల మత్స్య శాఖ విద్యార్థులను, అధ్యాపకులను ఇక్కడకు తీసుకువచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం, కృషికల్ప ఫౌండేషన్ సీఈవో సీఎం పాటిల్, ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్ సురేఖ, డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అయోధ్య రెడ్డి , మత్స్యసహకార సొసైటీ అధ్యక్షుడు కొమురయ్య పాల్గొన్నారు.