సిద్దిపేట/ చిన్నకోడూరు, మార్చి 8: మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే తన అభిమతమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో చిన్నకోడూరు, పెద్దకోడూరు, చంద్లాపూర్, చెల్కలపల్లి, అల్లీపూర్, మాచాపూర్, ఎల్లాయిపల్లి తదితర గ్రామాలకు చెందిన 500 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మీప్రేమ.. మీ ఆశీర్వాదం తనకు కొండంత బలం అన్నారు. చిన్నకోడూరు మండలంలో 500 మందికి కుట్టు శిక్షణ, ఉచితంగా కుట్టుమిషన్లను అందజేశామన్నారు. మహిళలు సొంత కాళ్ల మీద నిలబడాలనే ఆకాంక్షతో ఉడతా భక్తిగా ఈ సహాయం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండల సమాఖ్యకు యాసంగి సీజన్ మార్కెట్ సేవారుసుం కింద 14.43 లక్షల చెక్కు అందజేశారు. వాటర్‌షెడ్ కార్యక్రమంలో మంజూరైన రూ.1.55 కోట్ల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందం గౌడ్, వైస్ ఎంపీపీ పాపయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మూర్తి బాల్‌రెడ్డి, రామచంద్రం, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు వేణు, నాయకులు ఉమేశ్‌చంద్ర, రవీందర్‌రెడ్డి, ఏపీఎం మహిపాల్, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు అన్ని అవకాశాలు కల్పిస్తేనే నిజమైన సమాజాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం, సిద్దిపేట రూరల్, అర్బన్ మండలం, చిన్నకోడూరు మండలం, నారాయణరావుపేట మండలాలకు చెందిన మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం రెండు బ్యాచ్‌లుగా ఆయా గ్రామాల్లో మహిళలకు ఉచిత కుట్టుశిక్షణ ఇప్పించానన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కుట్టుమిషన్లు అందజేయడం సంతోషంగా ఉందిన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2200 మందికి ఉచితంగా కుట్టుశిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఉచిత కుట్టుశిక్షణ ఇవ్వడంతో 10వేల రూపాయల విలువ కుట్టుమిషన్ ఉచితంగా ఇసున్నట్లు తెలిపారు. మహిళాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేసినట్లు గుర్తుచేశారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా, రాజకీయాలతో సంబంధం లేకుండా మీ కుటుంబ సభ్యుడిగా మీకోసం పనిచేస్తున్నని, కంపెనీల వద్ద ఉద్దెర పెట్టి మీకోసం కుట్టుమిషన్లు తెచ్చి పంపిణీ చేస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. తనపై మీ ప్రేమ ఆశీర్వాదం ఎప్పటికీ ఇలాగే ఉండాలన్నారు. ఎస్టీ, బీసీ విద్యార్థినుల కోసం డిగ్రీ గురుకుల కాలేజీలను ప్రారంభించానని తెలిపారు. సిద్దిపేటలో మహిళల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. తన శక్తిమేర సిద్దిపేట అభివృద్ధికి అన్నివిధాలా కృషిచేసినట్లు తెలిపారు.