సమైక్య పాలనలో వెనుకబాటుకు గురైన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరుగుతున్నది. దీంతో ఈ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపడి ప్రజల జీవన ప్రమాణాలు మారుతున్నాయి. ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్‌రావు నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకు విస్తృతంగా పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే మాణిక్‌రావు, అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, సమీకృత మార్కెట్ ప్రారంభం, రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. షాదీఖాన, మినీ హజ్‌హౌస్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.
-జహీరాబాద్, డిసెంబర్ 26
అల్గోల్ రోడ్డులో ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతులు చేసేందుకు సిద్ధం చేసిన శంకుస్థాపన శిలాఫలకం
జహీరాబాద్, డిసెంబర్ 26 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. నేడు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్‌రావు ఈ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి పర్యటనను విజయవంత చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే మాణిక్‌రావు, అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
జహీరాబాద్‌లో సమీకృత మార్కెట్ సిద్ధం..
జహీరాబాద్ పట్టణంలో రూ.10 కోట్లతో నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్ భవనాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. కూరగాయలు, మాంసం, చికెన్, చేపలు అమ్మకాలు చేసే వ్యాపారులకు షెడ్లను డ్రా ద్వారా తీసి కేటాయించారు. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా షెడ్లు నిర్మాణం చేసి సౌకర్యాలు కల్పించారు. గతం లో ఇక్కడ వ్యాపారాలు చేసిన వారికి షెడ్లు కేటాయించారు. వాణిజ్య షాప్‌లను బహిరంగ వేలం ద్వారా వ్యాపారులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమీకృత కూరగాయల మార్కెట్ పట్టణ మధ్యలో ఉండడంతో ఎక్కవ మంది వ్యాపారులు షాప్‌లు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించారు. వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
ముస్లిములకు షాదీఖాన, మినీ హజ్‌హౌస్..
జహీరాబాద్ పట్టణంలో అధికంగా ఉన్న ముస్లిములకు సౌకర్యాలు కలిపించేందుకు మంత్రి హరీశ్‌రావు ప్ర త్యేక కృషిచేస్తున్నారు. పేద ముస్లిములు వివాహాలు, విందులు చేసుకోవడానికి షాదీఖాన నిర్మాణానికి ప్రభుత్వం హోతి (కే) శివారులో భూమి కేటాయించింది. విశాలమైన షాదీఖాన నిర్మాణంతో పాటు మినీ హజ్‌హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావడంతో ముస్లిములు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు..
జహీరాబాద్ పట్టణంలో ఉన్న పలు కుల సంఘాలకు భవనాల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి కేటాయించి, నిధులు మంజూరు చేసింది. యాదవ సంఘం, ముదిరాజ్, అంబేద్కర్ భవనం, కైస్తవ భవనం, నాయీబ్రాహ్మణ భవనం, పద్మశాలీ భవనంతో పాటు 12 కుల సంఘాల భవనాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. వీరికి జహీరాబాద్ పట్టణంలోని అల్గోల్ రోడ్డు(ఎంఆర్‌హెచ్‌ఎస్) పాఠశాల మైదానం ముందు ఏర్పాటు చేసే సభలో మంత్రి పత్రాలు అందజేస్తారు. స్థలం కేటాయించడంతో పాటు నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కుల సంఘాల పెద్దలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పంపిణీకి సిద్ధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు ..
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో అద్దె ఇండ్లలో నివాసముంటున్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేసేందుకు అధికారులు డ్రా తీసి లబ్ధ్దిదారులను ఎంపిక చేశారు. డ్రాలో ఎంపికైన లబ్ధ్దిదారులకు ఇండ్లు పంపిణీ చేసేందుకు సర్వేచేసి వారి వివరాలు సేకరించారు. పట్టణంలోని రహ్మిత్నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద భోజనాలు, సమావేశం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 312 మంది లబ్ధ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే మాణిక్‌రావులు పలుమార్లు ఇండ్లును పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. సొంతింటి కల సాకారం అవుతుండడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్ల మరమ్మతులకు భారీగా నిధులు మంజూరు..
జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి రోడ్డును మరమ్మతు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అల్గోల్ రోడ్డులో రెండు శాఖలకు చెందిన పనులకు మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శంకుస్థాపనలు చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నట్లు ఎమ్మెల్యే మాణిక్‌రావు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో భారీగా నిధులు మంజూరు చేశారు. రోడ్ల మరమ్మతులకు అధికారులు టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి హరీశ్‌రావు పర్యటన షెడ్యూల్..
ఆర్‌ఆండ్‌బీ రోడ్లుకు మంజూరైన నిధులు..
జహీరాబాద్ నియోజకవర్గంలో ఆర్అండ్బీ రోడ్లు మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జహీరాబాద్-బోనాస్పూర్ రోడ్డుకు రూ. 4.60 కోట్లు, జహీరాబాద్ -చించొళి రోడ్డుకు రూ. 4.60 కోట్లు, పస్తాపూర్-కుప్పానగర్ రోడ్డుకు రూ. 2.55 కోట్లు, అల్లాదుర్గం, మెటల్‌కుంట రోడ్డుకు రూ. 5.80 కోట్లు, కోహీర్- గోటిగార్పల్లి రోడ్డుకు రూ. 1.30 కోట్లు, గౌసాబాద్,మాడ్గి, ధనసిరి రోడ్డుకు రూ.1.85 కోట్లు, గోటిగార్పల్లి- గోపన్‌పల్లి రోడ్డుకు రూ. 52.లక్షలు, రాంతీర్థం- వడ్డీ రోడ్డుకు రూ. 1.60 కోట్లు, అసాద్గంజ్- కాశీంపూర్ రోడ్డుకు రూ.1.85 కోట్లు, గోటిగార్పల్లి- కోహీర్ రోడ్డుకు రూ. 1.30 కోట్లు మంజూరు చేసింది.